నలుగురు నిన్నే చూసేలా మిడ్డీస్ ధరించు.. లో దుస్తుల్లో పేకాట ఆడుదాం... భార్యకు భర్త టార్చర్

suicide
Last Updated: ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:28 IST)
తమ కుమార్తెను అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయికిచ్చి పెళ్లి చేసి విదేశాలకు పంపించామన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం మిగలలేదు. స్వదేశంలో శోభనం కార్యక్రమం ముగించుకుని అమెరికాకు తీసుకెళ్లి భర్త... తనలోని పైశాచికత్వాన్ని బయటపెట్టాడు.
 
కట్టుకున్న భార్యను నలుగురు చూసేలా కురచ దుస్తులు (మిడ్డీస్) ధరించాలనీ, లో దుస్తులు మాత్రమే ధరించి తనతో పేకాట ఆడాలని, మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేయాలంటూ ఇలా నానా రకాలుగా చిత్రహింసలు పెట్టాడు. ఈ వేధింపులు భరించలేని ఆ వివాహిత ఒకసారి స్వదేశానికి వచ్చింది. కానీ, అమెరికా సంబంధం తెంచుకోవద్దమ్మా అంటూ తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగువారు సర్దిచెప్పడంతో మనసు చంపుకుని మళ్లీ భర్తకు వద్దకు వెళ్లింది. 
 
కానీ, ఆ కిరాత భర్తలో ఏమాత్రం మార్పురాలేదు. పైశాచిక ఆనందాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మాల్యాద్రి, గంగాధరి దంపతులు నేరేడ్‌మెట్‌లో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె మాధురిని బీటెక్ చదివించారు. మాధురికి మధ్యవర్తుల ద్వారా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కోటేశ్వరరావు సంబంధం రాగా, 2016 నవంబరు నెలలో ఘనంగా వివాహం జరిపించారు. 
 
ఆ తర్వాత భర్తతో కలసి తమ బిడ్డ అమెరికాకు వెళితే, సంబరపడిపోయారు. అక్కడికి వెళ్లిన తర్వాత మాధురికి, కోటేశ్వరరావు అసలు స్వరూపం తెలిసింది. పొట్టి దుస్తులు ధరించి బయటకు రావాలని, లో దుస్తులు ధరించి పేకాట ఆడుతూ మందు కొట్టాలని హింసించడం ప్రారంభించాడు. ఇది సరికాదంటే చిత్ర హింసలు పెట్టాడు. దీంతో విసిగిన మాధురి గతంలో పుట్టింటికిరాగా, రెండు కుటుంబాలూ నచ్చజెప్పి తిరిగి అమెరికాకు పంపించాయి.
 
అయినా కోటేశ్వరరావు బుద్ధి మారలేదు. ఇక అతని వేధింపులు తాళలేని మాధురి, 11వ తేదీన భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడ జరుగుతున్న ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఓదార్చే క్రమంలో ఉండగానే, శనివారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మాధురి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత చదవండి :