గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (13:42 IST)

పదవుల కోసం చేరలేదు.. దానికో లెక్కుంది: హీరో మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మోహన్ బాబు ఎట్టకేలకు మంగళవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ అధినేత జగన్‌తో సమావేశమైన తర్వాత ఆ పార్టీలో చేరారు. మోహన్‌బాబుకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసిందంటూ ఇటీవల ఆందోళన చేసిన మోహన్‌బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
 
వైఎస్‌ కుటుంబంతో మోహన్‌బాబుకు బంధుత్వం ఉంది. మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య.. వైఎస్‌ సోదరుడి కుమార్తె. ఈ కారణంగానే తరచూ జగన్‌ను మోహన్‌బాబు కలిసేవారు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మోహన్‌బాబు కలిశారు. రాజకీయం వేరు.. బంధుత్వం వేరు అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబును కలవడంతో టీడీపీలోకి మోహన్‌బాబు రీఎంట్రీ ఖాయమని వార్తలొచ్చినా వాటిని ఆయన ఖండిస్తూనే వచ్చారు. 'నేను ఏ పార్టీకి చెందని వ్యక్తిని' అని తరచూ వ్యాఖ్యానించే మోహన్‌బాబు ఇటీవల కాలంలో జగన్‌తో పలుమార్లు భేటీ అయ్యారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన సందర్భంగా జగన్‌ను స్వయంగా పరామర్శించారు. ఈక్రమంలో ఇవాళ వైసీపీలో చేరారు. 
 
దీనిపై మోహన్ బాబు మాట్లాడుతూ, తాను పదవులను ఆశించి చేరలేదన్నారు. అలాగే, బంధువని చేరలేదని స్పష్టంచేశారు. ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకంతో వైసీపీలో చేరినట్టు వివరించారు. నిజానికి వైసీపీలో చేరాల్సిందిగా మూడేళ్ల క్రితమే జగన్‌ తనను ఆహ్వానించారని తెలిపారు. ఎమ్మెల్యేనో, ఎంపీనో అవ్వాలనుకుంటే మూడేళ్ల క్రితమే వైసీపీలో చేరేవాడినని చెప్పారు. ఎన్టీఆర్‌ మరణం తర్వాత తాను ఏ పార్టీలోనూ చేరలేదని.. బీజేపీకి మాత్రం ఓ సందర్భంలో మద్దతు ఇచ్చానని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తానని మోహన్‌బాబు స్పష్టం చేశారు. 
 
మరోవైపు, వెస్ట్ గోదావరి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ కీలక నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో మంగళవారం వైకాపాలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓటమి పాలైన సుబ్బారాయుడు.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున నరసాపురం టికెట్‌ ఆశించి భంగపడ్డ సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో ఇవాళ టీడీపీకి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు.