ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 'దూకుడు'కు బ్రేకుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ మార్చ్ ఉద్యమానికి అనుమతి, ఆ తర్వాత ఉద్యమకారుల అణిచివేత, సొంత పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీల అరెస్టు తదితర విషయాల్లో ఆయన ప్రదర్శించిన తెగింపు గతంలో ఎన్నడూ లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మరోవైపు తెలంగాణ అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అంశానికి ఢిల్లీలోనే పరిష్కారం కనుగొంటారని వ్యాఖ్యానిస్తూ వచ్చిన సీఎం ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడానికి గల కారణాలేంటన్నదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.