మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (14:40 IST)

150 ఏళ్ల మహావృక్షమే.. ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది!

150 సంవత్సరాల రావిచెట్టు విరిగిపడి.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తరతరాలుగా సేదదీర్చిన మహావృక్షమే మృత్యువులా విరుచుకుపడింది. నీడనిచ్చిన కొమ్మలే మారణాస్త్రాలుగా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. 
 
కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో 150 ఏభై ఏళ్ల నాటి రావి చెట్టు విరిగి పడి.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొక్కా నాగేశ్వరరావు (50), రైతు ఈదర సత్యనారాయణ (70) ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో పదిమంది గాయపడ్డారు. వారిలో చెట్టు నీడన ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు ఉన్నారు.

తాతపూడిలో గోదావరి గట్టు సమీపంలో కాలువ గట్టుపై భారీ రావిచెట్టు ఉంది. బలమైన మానుతో, గుబురైన ఆకులతో ఉండే ఈ మహావృక్షం కొమ్మల్లో కొన్ని గ్రామం వైపూ, కొన్ని కాలువ వైపూ విస్తరించాయి. చెట్టు చుట్టూ గ్రామస్తులు రచ్చబండతో పాటు చిన్నగుడినీ నిర్మించుకున్నారు. ఆదివారం ఉదయం చెట్టు కాండం మధ్య భాగంలో చీలిక రావడాన్ని గ్రామస్తులు గమనించారు. 
 
ఊరి వైపున్న కొమ్మల్లో కొన్నింటిని నరికివేస్తే తలబరువు తగ్గి విరిగిపడే ప్రమాదాన్ని నివారించవచ్చని భావించారు. గ్రామం వైపు విస్తరించిన కొమ్మలను నరికేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పలువురు నరికే కొమ్మలు ఎక్కడ మీద పడతాయోనని కాలువ వైపు కొమ్మల కిందకు చేరారు. అదే వారి పాలిట మృత్యువుతో చెలగాటమైంది.
 
అప్పటికే కాండం లోపల డొల్లబారి ఉండడంతో చెట్టు..కాలువ వైపు భాగంగా ఫెళఫెళా విరిగి పడింది. అంత మహావృక్షం అనూహ్యంగా విరుచుకుపడుతుంటే జనం భీతావహులై, తలోదిక్కూ పరిగెత్తబోయారు. భారీ కొమ్మ పడడంతో తలపగిలిన బొక్కా నాగేశ్వరరావు, తలకు తీవ్రగాయమైన ఈదర సత్యనారాయణ అక్కడికక్కడే మరణించారు. యింటూరు వీర్రాజు, కొరిపెల్ల సత్యనారాయణల కాళ్ళు విరిగిపోయాయి. 
 
వీరితో గాయపడ్డ యింటూరి పోలయ్య, ఠానేలంక శ్రీనివాస్‌లను రాజమండ్రి లోని ప్రైవేటు ఆస్పత్రికి, గుత్తుల సూర్యనారాయణ, నడిపల్లి సత్యనారాయణ, బాలలైన  అంగర మణికంఠస్వామి, కడియాల సాల్మన్‌రాజు, రాపాక వంశీ, రాపాక రాములను మండపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములైన వంశీ, రాము ఆడుకోవడానికి చెట్టు కిందకు వచ్చి గాయాల పాలయ్యారు.