శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (07:57 IST)

తిరుమలలో 20 బుల్లెట్ షెల్స్.. షాక్ తిన్న అధికారులు..బయట పడ్డ స్కానింగ్ డొల్లతనం

తిరుమలలో బుల్లెట్ల కలకలం రేగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 బుల్లెట్ షెల్స్ బయటపడ్డాయి. లగేజీ వ్యాను ద్వారానే నేరుగా అవి తిరుమల చేరుకున్నాయి. వాటిని తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను విజిలెన్సు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అలిపిరి స్కానింగులో ఉన్న డొల్లతనం బయట పడింది. గురువారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మహారాష్ట్రలోని పూనెకు చెందిన అనిల్(52) ఆర్మీలో పదవీ విరమణ పొంది అక్కడి వ్యవ సాయ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో వాడేసిన బుల్లెట్ల షెల్స్‌ను ఓ బ్యాగులో ఉంచాడు. వాటిని తీయకుండా  శ్రీవారి దర్శనం కోసం అదే బ్యాగులో  లగేజీ పెట్టుకుని  కుమారుడితో కలిసి గురువారం తిరుపతికి చేరుకున్నారు.
 
అలిపిరి వద్ద తమ లగేజీని డిపాజిట్ చేసి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఆ లగేజీ సర్దే సమయంలో బ్యాగులోని బుల్లెట్లు కిందపడ్డాయి. వాటిని  విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, తండ్రీకొడుకులను టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి టూ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో తాను వాడేసిన షెల్స్ ను ఓ బాక్సులో పెట్టాననీ, అవి పొరబాటున తమ ప్రయాణ బ్యాగులోకి వచ్చేశాయని చెపుతున్నారు. ఇదిలా ఉంటే అలిపిరి వద్ద స్కానింగులో కూడా వీటిని గుర్తించకపోవడంతో అక్కడ డొల్లతనం బయట పడింది.