శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 26 జనవరి 2017 (06:02 IST)

తెలంగాణలో కొలువుల జాతర.. ఏపీలో సాగర దీక్షల జాతర

ఒకవైపు ఆంద్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా డిమాండుతో దీక్షల పర్వం జరుగుతుంటే.. తెలంగాణలో కొలువుల జాతర పెరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక భవిత నిరాశాపూరితం అవుతున్న దశలో ఏపీ యువత అటో ఇటో తేల్చుకోవాలని ఉద్యమాల బాట పడుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత

ఒకవైపు ఆంద్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా డిమాండుతో దీక్షల పర్వం జరుగుతుంటే.. తెలంగాణలో కొలువుల జాతర పెరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక భవిత నిరాశాపూరితం అవుతున్న దశలో  ఏపీ యువత అటో ఇటో తేల్చుకోవాలని ఉద్యమాల బాట పడుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రెండో దశ కొలువుల జాతర మొదలు పెట్టేసింది.
 
ఇప్పటికే వివిధ శాఖల్లో ఇంజనీరింగ్‌ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. ఇక విద్య, సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుడుతోంది. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా నెలకొల్పుతున్న గురుకుల పాఠశాలల్లో 23,494 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
మొదటి దశలో 8,245 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ప్రభుత్వం గురుకుల స్కూళ్లను ప్రకటించింది. ఈ పాఠశాలల్లో అత్యుత్తమ బోధన అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి అన్నారు. ఈ స్కూళ్లకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పారు. వీటితోపాటు విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తారు.
 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కొత్తగా 726 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతావి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని సీఎం అధికారులకు స్పష్టంచేశారు. పాఠశాలల్లో తరగతులు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల నియామకాలు జరగాలని, ప్రతీ ఏడాది అవసరమైనన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. అందుకు కేసీఆర్ అంగీకరించారు.
 
మొత్తం 23,494 పోస్టుల్లో 20,299 పోస్టులు బోధన, 3,195 బోధనేతర సిబ్బంది అవసరమని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్‌ కోసం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించడంతో పాటు భవనాలు కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్వహణ, భవన నిర్మాణాలు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏమిటంటే రెండున్నరేళ్ల  పాలన తర్వాత కూడా యువత ఉపాధి అవకాశాలపై ఏమాత్రం ఆశ లేక తల్లడిల్లిపోతోంది. అందుకే ప్రత్యేక హోదాపై ఏ పార్టీ, ఏ నేత చివరకు సినీనటులు పిలుపునిచ్చినా సరే పొలోమంటూ వారి వెనుకంటి పరుగెత్తడం. ఆశకు ప్రాణం పోసే వారికోసం బేలగా ఎదురు చూడటం.