శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (19:25 IST)

ఏపీలో 24*7 విద్యుత్ డీల్ : చంద్రబాబు - పియూష్ గోయల్ హర్షం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో 24 గంటల విద్యుత్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వం మద్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం పత్రాలను కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. విద్యుత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని వారు చెప్పుకొచ్చారు. 
 
ఈ ఒప్పందం మేరకు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నిరంతర విద్యుత్‌ సరఫరా కానుంది. 6,500 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో 4 వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు అనంతపురం, కర్నూల్‌ జిల్లాల్లో 2,500 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని, పరిపాలనా దక్షుడని పీయూష్‌ గోయల్‌ ప్రశంసించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  
 
రాబోయే ఐదేళ్లలో రూ.85 వేల కోట్లు ఖర్చుపెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామాల్లో 24 గంటలూ, 7 నుంచి 9 గంటలు వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఏపీని నిరంతర విద్యుత్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి గోయల్‌కు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.