శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (16:32 IST)

తొలగిన కరెంట్ కష్టాలు.. ఏపీలో 24 గంటల విద్యుత్ వెలుగులు!

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు దాదాపుగా తొలగిపోయినట్టే కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తొలి రెండు నెలల్లో తీవ్రమైన విద్యుత్ కోతలను ఈ 13 జిల్లాలు ఎదుర్కొన్నాయి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ అధికారులు తీసుకున్న సత్వర చర్యల పుణ్యమాని ఈ విద్యుత్ కొరత నుంచి రాష్ట్రం గట్టెక్కింది. ఫలితంగా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం చల్లబడటంతో పాటు.. కేంద్రం నుంచి అదనంగా 500 మెగావాట్‌ల విద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతోంది. దీనికి తోడు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. దీనికితోడు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా కరెంట్ ఉత్పత్తి మెల్లగా పుంజుకుంటోంది. 
 
దీంతో విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తి వేయడమే కాకుండా, పీక్ సమయాల్లో ఉన్న విద్యుత్ వినియోగంపై ఉన్న ఆంక్షలను సైతం ప్రభుత్వం ఎత్తివేసింది. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తి కూడా పెరగనుంది. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు కరెంట్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. 
 
పరిస్థితి ఇదే విధంగా కొనసాగినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా అక్టోబర్ నెల నుంచి 24 గంటల పాటు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.