బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 21 డిశెంబరు 2016 (22:53 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 లక్షల రూపే కార్డుల జారీ

రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీలు ముమ్మరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పెద్ద నోట్ల చలామణిపై తీవ్రమైన ఆంక్షలు, కొత్త నోట్ల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వేలల్లో ఈ-పాస్ (పీఓఎస్- పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు

రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీలు ముమ్మరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పెద్ద నోట్ల చలామణిపై తీవ్రమైన ఆంక్షలు, కొత్త నోట్ల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వేలల్లో ఈ-పాస్ (పీఓఎస్- పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు సరఫరా చేస్తున్నారు. లక్షల్లో రూపే కార్డులు పంపిణీ చేస్తున్నారు. రూ.1000, రూ.500 నోట్లపై ఆంక్షలు విధించిన నవంబర్ 8 నుంచి అన్ని ప్రాంతాలలో నగదురహిత లావా దేవీలు పెరిగిపోయాయి. 
 
రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పడికప్పుడు ఈ వ్యవహారలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి కొత్త నోట్లు రాష్ట్రానికి తెప్పించారు. అలాగే ఈ-పాస్ మిషన్లు, రూపే కార్డుల పంపిణీ గురించి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణులు ఇబ్బందులు పడకూడదని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది.
 
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక చర్యలు తీసుకుంది. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 27,41,244 రూపే కార్డులు జారీ చేశారు. ఇవి ఏటీఎం కార్డులు లాంటివే. అయితే ఇవి దానికంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. వీటీని ఇటు ఏటీఎంలలోనూ, అటు గ్రామీణ ప్రాంతాలలోని సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్), బ్యాంకు మిత్రల వద్ద ఉండే మైక్రో మిషన్లలో కూడా ఉపయోగించవచ్చు. ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ప్రారంభించిన వారందరికీ రూపే కార్డులు ఇస్తున్నారు. 
 
జిల్లాల వారీగా పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో అత్యధికంగా 4,49,587 కార్డులు జారీ చేశారు. 4,01,309 కార్డుల జారీతో కృష్టా జిల్లాలో ఆ తరువాతి స్థానంలో ఉంది. అనంతపురం జిల్లాలో 2,17,882 కార్డులు, చిత్తూరు జిల్లాలో 1,34,987, తూర్పుగోదావరి జిల్లాలో 1,82,511, గుంటూరు జిల్లాలో 1,87,298, కడప జిల్లాలో 1,85,500, కర్నూలు జిల్లాలో 1,78,877, ప్రకాశంలో 2,05,688, నెల్లూరు జిల్లాలో 1,41,475, శ్రీకుళం జిల్లాలో 1,60,964, విశాఖపట్నం జిల్లాలో 1,45,150, పశ్చిమగోదావరి జిల్లాలో 1,50,016 కార్డులు జారీ చేశారు. 
 
గ్రామీణులకు క్యాష్‌లెస్ లావాదేవీలలో శిక్షణ
రాష్ట్రంలోని పేదలకు, గ్రామీణులకు క్యాష్‌లెస్ లావాదేవీలలో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఇజీఏ) సిబ్బంది, విద్యార్థులు వారికి తెలియజేస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,47,960 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేశారు. 80,10,722 మంది మాత్రమే చురుకుగా పనులలో పాల్గొంటున్నారు. వారిలో 33,98,046 మందికి క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ ఇచ్చినట్లు ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పారు. 
 
జిల్లాలవారీగా పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 6,40,000 మందికి శిక్షణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,75,923 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 3,47.921 మందికి, విజయనగరం జిల్లాలో 3,46,470 మందికి శిక్షణ ఇచ్చారు. మిగిలిన వాటిలో అనంతపురం జిల్లాలో 2,57,864 మందికి, చిత్తూరు జిల్లాలో 2,62,230 మందికి, గుంటూరు జిల్లాలో 74,560 మిందికి, కడప జిల్లాలో 1,80,982 మందికి, కృష్ణా జిల్లాలో 2,87,820 మందికి, కర్నూలు జిల్లాలో 1,78,877 మందికి, ప్రకాశం జిల్లాలో 4,753 మందికి, నెల్లూరు జిల్లాలో 2,18,341 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 2,22,305 మందికి క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ ఇచ్చారు.
 
నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని గ్రామాలలో ఈ-పాస్ మిషన్లు, సీఎస్పీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల రూపే కార్డులను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలో 13,104 గ్రామాలు ఉన్నాయి. అయితే  ఆరు వందల గ్రామాలలో మాత్రమే నెట్ కనెట్టివిటీ లేదు. అటువంటి గ్రామాలలో సీఎస్పీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా ఆధార్ బయోమీటర్, ఐరిస్ లు సరిచూసుకొని క్యాష్‌లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో బ్యాంకు సేవలు అందే ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇప్పటికే బ్యాంకు బ్రాంచ్‌లు లేని 5291 గ్రామ పంచాయితీలలో బ్యాంకు మిత్రలు చురుకుగా తమ సేవలందిస్తున్నారు. మిగిలిన గ్రామాలలో కూడా బ్యాంకు మిత్ర సేవలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలను తెరుస్తున్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాష్‌లెస్ లావాదేవీలు ఎక్కువగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.