శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (12:42 IST)

స్వైన్ ఫ్లూ : ఒంగోలులో మహిళ మృతి.. విశాఖలో ఏడు కేసులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్వైన్ ఫ్లూ నెమ్మదిగా విస్తరిస్తోంది. తాజాగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో స్వైన్ ఫ్లూ మహమ్మారి ధాటికి ఒక మహిళ మృతి చెందగా, విశాఖపట్టణంలో కొత్తగా ఏడుగురు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
 
ఒంగోలులో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోకిల (75) అనే మహిళ శనివారం ఉదయం చనిపోయింది. ఈమె మృతితో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో, జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు.. విశాఖ నగరంలో కొత్తగా 7 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని జాయింట్ కలెక్టర్ నివాస్ ప్రకటించారు. వీరిలో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇద్దరికి ప్రైవేటు ఆసుపత్రిలో, ఒకరికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. మరో ఇద్దరి రక్త నమూనాలను పరీక్షల కోసం హైదరాబాదుకు పంపినట్టు తెలిపారు. నగరంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో... విశాఖ వాసులు కలవరపడుతున్నారు.