బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (10:55 IST)

ప్రభుత్వ భూమా...! రాసిచ్చేయ్.. జాయింట్ కలెక్టర్ సస్పెన్షన్

ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తిరుపతి ప్రభ ఉట్టిపడుతూనే ఉంటుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న భూముల విలువ ఆకాశానికి అంటుతుంటుంది. ఇదే అదునుగా భూ ఆక్రమణలు స్వాహాలు పెరిగిపోయాయి. ఈ అక్రమాలలో జిల్లాలో స్థాయిలోనే ఉన్నతాధికారుల హస్తం ఉందనే విషయం తేటతెల్లం అయ్యింది. ఆరు నెలల పాటు జిల్లా స్థాయిలో అధికారిగా పని చేసిన ఒకరి అక్రమాలు చూసి రాష్ట్ర స్థాయిలోని అధికారులు నోరువెల్లబెట్టారు. అప్పనంగా తాను భూబకాసురులకు కట్టబెట్టిన భూముల విలువ వందల కోట్లు ఉంటుందని తెలిసి నివ్వెర పోయారు. ఆయన హస్తవాసిని చూసి ఆశ్చర్యపోయారు. చివరకు తేరుకుని ఆయనను సస్సెండ్ చేశారు. మరకొందరిపై వేటుకు సిద్ధమవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 
 
ఇటీవల ముఖ్యమంత్రి చందబాబు నాయుడు జిల్లా పర్యటనలో తిరుపతి చుట్టుపక్కల భూముల్లో ఆక్రమణలు చూసి నివ్వెరపోయారు. అసలు ఆయా భూముల్లో ఆక్రమణలకు కారణాలపై వెంటనే ప్రాథమికంగా నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో పాత దస్త్రాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తిరగదోడారు. రుపతి అర్బన్‌ పరిధిలోని మంగళం సర్వే నెం.78/2బీ2, 2బీ3, తిరుపతి రూరల్‌ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని సర్వే నెం.88,89,91, తొట్టంబేడు మండలం సీతారామపురం (ఎర్లగుంట కండ్రిగ) సర్వే నెం.1-21లలో కొన్ని భాగాలు, తిరుపతి అర్బన్‌లోని అక్కారంపల్లిలో సర్వే నెం. 118/3, 112/1ఏ, 112/3,4,5,6,8,9 లలో, సర్వే నెం. 105/10, పుత్తూరు మండలం అరణాయం కండ్రిగ గ్రామంలోని సర్వే నెం. 226లలోని దాదాపు 105.4 ఎకరాల ప్రభుత్వ భూమికి రైత్వారీ పట్టాలు జారీ చేసి రూ.వందల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యాయని గుర్తించారు. 
 
ఈ సమయంలో అధికారి ఎవరున్నారని ఆరాతీస్తే అప్పటి జిల్లా కలెక్టర్ గా పని చేసిన శ్రీధర్‌ పేరు బయటకు వచ్చింది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు వరకూ బసంత్‌కుమార్‌ సంయుక్త కలెక్టరుగా ఉన్నారు. గవర్నర్‌ కార్యదర్శిగా బసంత్‌కుమార్‌ నియమితులు కావడంతో ఎన్నికలకు ముందు గతేడాది మార్చి 10న శ్రీధర్‌ సంయుక్త కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలు పూర్తయినా గత ఏడాది సెప్టెంబరు 4న బదిలీపై వెళ్లారు. శ్రీధర్‌ జిల్లాలో సంయుక్త కలెక్టరుగా పనిచేసిన సమయంలో సెటిల్‌మెంట్‌ అధికారి హోదాలో తిరుపతి, తొట్టంబేడు, పుత్తూరు మండలాల్లోని దాదాపు 105 ఎకరాల ప్రభుత్వ భూములకు రైత్వారీ పట్టాలు జారీ చేసినట్లు సమాచారం. 
 
దీంతో పాటు ఇనాం భూములను కూడా క్రమబద్ధీకరించారనే తీవ్రమైన ఆరోపణలున్నాయి. తిరుపతి చుట్టుపక్కల భూముల అక్రమ వ్యవహారంపై జిల్లాలో సంయుక్త కలెక్టరుగా పనిచేసిన శ్రీధర్‌ హస్తం కూడా ఉందని తేలింది. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెన్షన్‌ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో నెం.53ను) జారీ చేసింది. తిరుపతిలో కొన్ని భూములకు సంబంధించిన జరిగిన సెటిల్‌మెంట్‌లలో దాదాపు రూ.10 కోట్ల మేర చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. భూ అక్రమ వ్యవహారంపై కొరడా ఝుళిపించిన ప్రభుత్వం శ్రీధర్‌పై చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారులపైనా త్వరలోనే వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.