శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (10:27 IST)

కిలాడి లేడీ... చీటిల మాయలాడి

చీటిల పేరుతో ఓ మహిళ జనాన్ని నిలువునా ముంచింది. వందలు కాదు, వేలు కాదు.. లక్షలూ కాదు ఏకంగా ఒకటిన్నర కోటి రూపాయలు ఎగనామం పెట్టింది. కోర్టులో ఐపి వేసి చీటిలు వేసిన వారిని బోల్తా కొట్టించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
30 ఏళ్ల క్రితం  పలమనేరు   ప్రాంతం నుంచి సత్యనారాయణశెట్టి, వనజ చంద్రగిరికి వలస వచ్చారు.  బతుకు తెరువుకోసం పరిసర గ్రామాల్లో బొగ్గు సేకరించి విక్రయించేవారు. వనజ భర్త  ఓ ప్రైవేటు బస్సులో  క్లీనర్‌గా చేరాడు. అనంతరం డ్రైవింగ్  నేర్చుకుని ఆర్టీసీలో డ్రైవరుగా చేరారు. వనజ భర్త  ప్రోత్సాహంతో చీటీల వ్యాపారం ప్రారంభించింది. ఆమె కూడా ప్రభుత్వాస్పత్రిలో  కాంట్రాక్ట్ పద్ధతిన  స్వీపర్‌గా చేరారు.

ఎంతోకాలంగా ఈ ప్రాంతంలో ఉండడంతో చీటీల వేయడం మొదలు పెట్టారు. వారిని జనం కూడా బాగా నమ్మారు. దాదాపుగా రూ. 1.2 కోట్లు వసూలు చేశారు. అయితే ఉన్నపళంగా శుక్రవారం తిరుపతి కోర్టులో కోటి 56 లక్షల 80వేల రూపాయలకు  ఐపీ దాఖలు చేయడంతో  బాధితులందరూ  లబోదిబోమంటున్నారు. వనజ ఓ ప్రముఖ  నాయకుడి కుమారుడు పేరుతో ఈ ఏడాది జనవరి 13న 2.79 ఎకరాల భూమి విక్రయించినట్లు  బాధితులు రికార్డులు చూపిస్తున్నారు.

ఆమె కుమారుడు బినామీగా 2014 డిసెంబర్ ఒకటో తేదీ సదుం ప్రాంతంలో  2కోట్ల 23లక్షల  రూపాయల విలువైన భూమి కొనుగోలుకు ఆమె అగ్రిమెంట్  చేయించుకుందని ఆరోపిస్తున్నారు. తమను మోసం చేశారని బాధితులు  చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.