శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (10:33 IST)

ఏసిబి వల : లంచం తీసుకుంటూ.. అడ్డంగా బుక్కయ్యాడు..

ఇవ్వాల్సిందల్లా డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం... అవతల కోరుతున్నది ఓ సామాన్య రైతు. ఆరు నెలలు తిరిగాడు. అదో ఇదో అంటూ కాలయాపన చేశాడు ఓ విఆర్వో..చివరకు లంచం కావాలన్నాడు. విసిగి పోయిన రైతు ఏసిబి అధికారులను సంప్రదించాడు. రైతుతో కలసి వల విసిరిన ఏసిబికి విఆర్వో అడ్డంగా బుక్కయ్యాడు. శనివారం సాయంత్రం ప్రకాశం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తోకపల్లెకు చెందిన రైతు కనకం పెద్ద కోటయ్య పాస్ పుస్తకం ఇటీవల పోయింది. డూప్లికేట్ పాస్ పుస్తకం కోసం వీఆర్వో బి.అచ్చయ్యను ఆయన కుమారుడు సుబ్బారావు సంప్రదించాడు. పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఎఫ్‌ఆర్‌ఐ కాపీతో పాటు వీఆర్వో చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. తరువాత రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.2 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.6 వేలు ఇస్తేనే డూప్లికేట్ పాస్ పుస్తకం ఇస్తానని చెప్పాడు. 
 
భరించలేకపోయిన సుబ్బారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు వల విసిరారు. డబ్బుతో సమీపంలోని పాత తహశీల్దార్ కార్యాలయానికి రావాలని సుబ్బారావుకు వీఆర్వో అచ్చయ్య సూచించాడు. అక్కడికి వెళ్లగానే రూ.6 వేల నగదు తీసుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి అచ్చయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊచలు లెక్కబెడుతున్నాడు. ఏసిబి దాడులు చేసిన వారిలో డీఎస్పీ మూర్తి, సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, కోటేశ్వరరావు ఉన్నారు.