మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (12:21 IST)

ఏడిఈ శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు: 20 కోట్లపైనే ఆస్తులు..!

సైదాబాద్ సరస్వతినగర్‌లోని ట్రాన్స్‌‍కో ఏడిఈ శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. అక్రమాస్తులు ఉన్నాయనే సమాచారంతో  సోదాల్లో భారీగా బంగారం, డబ్బు, ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. శ్యాంసుందర్ రెడ్డి రూ. 20 కోట్లపైనే ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
మింట్ కంపౌండ్‌లో ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న శ్యాంసుందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు సైదాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 2 కోట్లకు పైగా ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
 
కూకట్ పల్లిలో రెండు భవనాలు, సైదాబాద్ సరస్వతీ నగర్‌లో ఓ భవనం, నేరేడ్‌మెట్‌లో ఫ్లాట్, బోడుప్పల్, కొంపల్లి, కురిమెళ్ల ప్రాంతాల్లో స్థలాలు, నాగర్ కర్నూలులో 11 ఎకరాల వ్యవసాయ భూమి, నందిగామలో 36గుంటల స్థలం ఉన్నట్లు తేలింది. ఇంకా రెండు బ్యాంకుల్లోని లాకర్లు తెరవాల్సి ఉందని ఏసిబి అధికారులు తెలిపారు. సోదాల తర్వాత మొత్తం అక్రమ ఆస్తి విలువ తేలనుందని ఏసిబి డిఎస్పీ రవికుమార్ చెప్పారు.
 
కాగా, తమకున్న ఆస్తులన్నీ సక్రమమైనవనేనని శ్యాంసుందర్ రెడ్డి, ఆయన భార్య చెప్పారు. తమ వద్ద రూ. 20 కోట్ల ఆస్తులున్నాయనడం మీడియాకు తెలపడం సమంజసం కాదని అన్నారు. సోదాలు జరిగినంత మాత్రాన అవినీతిపరులని ఎలా అంటారని ప్రశ్నించారు.