గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (17:41 IST)

శివాజీకి, బీజేపీకీ సంబంధం లేదట... ఎవరన్నారు... ఎప్పుడు...?

సినీ నటుడు శివాజీ బీజేపీలో ఉన్నారని అనుకునేవారికి ట్విస్టే. గత ఎన్నికలలో శివాజీ బీజేపీ తరఫున ప్రచారం చేసి, కమలం కండువా కూడా కప్పుకుని తిరుగుతున్నారు కనుక ఆయన బీజేపి నాయకుడని అనుకుంటున్నారు. దీనికితోడు ఆయన పలుమార్లు బీజేపీ ప్రతినిధిగా ఆవేశంగానూ, ఆవేదనగానూ మాట్లాడుతుంటారు. ఆమధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ పదవి కూడా ఆయనకు వస్తుందనుకున్నారు. ఐతే ఈమధ్య శివాజీ ఏపీ ప్రత్యేక హోదా గురించి మీడియాలో తరచూ కనబడుతున్నారు.
 
దీనిపైన, తెదేపా పైన భాజపా నాయకుడు సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. హీరో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలతోనూ తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ట్విస్ట్ ఇచ్చారు. భాజపా లీడర్ సోము వీర్రాజు ఈ విషయాలపై ఢిల్లీలో ప్రస్తావిస్తూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందన్నారు. తెదేపా-భాజపా మిత్రధర్మాన్ని కాపాడుతూ పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. 
 
తెదేపాపై హీరో శివాజీ విమర్శలు చేయడంపై ఆయన బదులిస్తూ... అసలు శివాజీకీ బీజేపీతో సంబంధం లేదని ట్విస్ట్ ఇచ్చారు. హీరో శివాజీ ఈమధ్య ప్రతి నగరంలోనూ ప్రత్యేక హోదాపై సమావేశాలు పెడుతూ అటు తెదేపాను, ఇటు భాజపాను నిలదీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శివాజీకి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వీర్రాజు చెప్పడం గమనార్హం. మరయితే శివాజీ తను భాజపా నాయకుడునని చెపుతారా... లేదంటే ఆయన కూడా ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటారా... చూడాల్సిందే.