మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (19:18 IST)

ఎర్రచందనం కేసు... నటి నీతూ అగర్వాల్‌కు రెండు రోజుల కస్టడీకి అనుమతి...

ఎర్రచందనం కేసులో అరెస్టు కాబడిన నటి నీతూ అగర్వాల్ కు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోవెలకుంట్ల కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు ఆమెను నంద్యాల జైలు నుంచి రుద్రవరానికి తీసుకెళ్లారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఆమెను ఏప్రిల్ 26న అరెస్టు చేసిన సంగతి విదితమే. 
 
కాగా ఏప్రిల్ 26న ఆమె కారులో బెంగుళూరుకు పరారవుతుండగా హైదరాబాద్‌లో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, స్మగ్లర్‌ బాలునాయక్‌ అకౌంటక్‌కు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్‌ పోలీసులకు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్ వలీలో నీతూకు గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నీతుని ఆదివారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ను సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆధారాల తర్వాతే అరెస్టు చేసినట్లు చెప్పారు. నీతు అగర్వాల్ పోలీసులకు చిక్కగానే ఏడ్చింది. మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు కూడా వెక్కివెక్కి ఏడ్చింది. 
 
కాగా, పోలీసుల విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అతడి వేధింపులు తట్టుకోలేక తాను అతడికి లొంగిపోయానని, ఈ క్రమంలోనే ఆ రొంపిలోకి దిగవలసి వచ్చిందని చెప్పారు. 
 
మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డాక ఆమె తన కుటుంబానికి దూరమయ్యారు. నీతు అరెస్టైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు కర్నూలు వచ్చారు. ఇదిలావుండగా, స్మగ్లర్ బాలునాయక్ బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదలీ చేసినట్లు నీతు అగర్వాల్ పోలీసులకు చెప్పారు. ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉపయోగించిన కారును సీజ్ చేశారు. మస్తాన్ వలీ, నీతు అకౌంట్ల మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.