శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (14:14 IST)

అగ్రిగోల్డ్ అరాచకానికి 103 మంది ఆత్మహత్య... అదే బాటలో బాధితులు...!

వంద కాదు.. వెయ్యి కాదు... కోట్ల రూపాయల డబ్బులు కట్టించుకున్నారు. వివిధ రకాల స్క్రీంల పేరుతో ప్రజలను మభ్యపెట్టారు. కట్టిన డబ్బు కన్నా ఎక్కువ మొత్తం వస్తుందనుకున్న కస్టమర్లకు ఒక్కసారిగా చుక్కలు చూపించార

వంద కాదు.. వెయ్యి కాదు... కోట్ల రూపాయల డబ్బులు కట్టించుకున్నారు. వివిధ రకాల స్క్రీంల పేరుతో ప్రజలను మభ్యపెట్టారు. కట్టిన డబ్బు కన్నా ఎక్కువ మొత్తం వస్తుందనుకున్న కస్టమర్లకు ఒక్కసారిగా చుక్కలు చూపించారు. ఇదంతా చేసింది ఎవరో కాదు అగ్రిగోల్డ్ సంస్థ. అగ్రిగోల్డ్ అరాచకానికి వారానికి ఒకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం కదలిక కనిపించడం లేదు. న్యాయం జరుగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. అగ్రిగోల్డ్ బాధితులపై  ప్రత్యేక కథనం. 
 
సరిగ్గా రెండున్నర సంవత్సరం.. అగ్రిగోల్డ్ యాజమాన్యం బాధితులను మోసం చేసి సంవత్సరాలవుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు. ఆస్తులు అమ్మకూడదని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు వెళ్ళడం, ఆస్తులు అమ్మాలని బాధితులు డిమాండ్ చేయడం.. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం మాత్రం వాటిని చూస్తూ ఊరుకున్నదే తప్ప చేసింది శూన్యం. ఇప్పటికే అగ్రిగోల్డ్‌లో డబ్బులు కట్టి మోసపోయాయని తెలిసి 103 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొంతమందైతే ఏజెంట్లుగా ఉండి డబ్బులు కట్టించి కస్టమర్ల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక ఊర్లు వదిలి వెళ్ళిపోయారు. 
 
ఇంకొంతమందైతే తమ ఆస్తులను అమ్మి కస్టమర్లకు ఇచ్చి సేఫ్‌గా బయటపడగలిగారు. అయితే డబ్బులులేని ఏజెంట్లు కస్టమర్లకు ఏం చెప్పాలో తెలియక ఇప్పటికీ నరకయాతనను అనుభవిస్తున్నారు. మహిళల పరిస్థితి అయితే మరింత అన్యాయం. డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తామో తెలియదంటూ నోటికొచ్చినట్లు శాపనార్థాలు పెట్టి మరి వెళుతున్నారు. మరికొంతమందైతే హీనంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. 2015 జనవరి నుంచి ఇప్పటివరకు కూడా అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి మరింత అన్యాయంగా తయారవుతోంది. 
  
తిండిలేని పరిస్థితిలోనూ అగ్రిగోల్డ్‌కు డబ్బులు కట్టి మోసపోయిన కొంతమందైతే రోడ్లమీదే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆస్తులు అమ్మడానికి ప్రయత్నం చేసేలోపే అగ్రిగోల్డ్ కోర్టుకెక్కింది. మా ఆస్తులు రూ.20 వేల కోట్లు ఉన్నాయి. కేవలం ఇవ్వాల్సింది రూ.7 వేల కోట్లు మాత్రమే. ఆస్తులను ప్రభుత్వం అమ్మొద్దండి.. మేమీ అమ్మి ఇస్తామంటూ కోర్టును ఆశ్రయించింది. 
 
దీంతో ఆ కేసు కాస్త అత్యున్నత న్యాయస్థానంలో ఇంకా నలుగుతూనే ఉంది. ఇంకేముంది బాధితుల్లో మళ్ళీ భయం మొదలైంది. అసలు ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి డబ్బులు తీసిస్తుందా లేదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. 
 
అగ్రిగోల్డ్ బాధితులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు 8,9 తేదీల్లో విజయవాడలోని వెలగపూడిలో నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు నేటి నుంచి అగ్రిగోల్డ్ బాధితులు నిరాహారదీక్షలను వెలగపూడిలోని అసెంబ్లీ హాలు ముందు ప్రారంభించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.