శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 మార్చి 2016 (14:42 IST)

'ప్లీజ్.. మా ఇద్దరికి పెళ్లి చేయండి'.. ప్రియురాలు :: మంచి ప్రవర్తన కాదు.. ప్రియుడు

అనంతపురంలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. తామిద్దరం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ, తీరా పెళ్లి మాటెత్తగానే కుంటి సాకులతో తప్పించుకుంటున్నాడనీ, అందువల్ల తమ ఇద్దరికి పెళ్లి చేయాలంటూ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అనంతపురం నగరంలోని గుల్జారిపేటకు చెందిన శాంతి అనే యువతి వినాయక నగర్‌లో ఉంటున్న ప్రియుడు నవీన్‌ కుమార్‌ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం ఏడేళ్లుగా సాగుతోంది. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆమెను వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో స్థానిక మహిళా సంఘాలను శాంతి ఆశ్రయించింది. వారి సహకారంతో దాదాపు 3 గంటలపాటు ఇంటి ముందు ప్రియురాలు నిరసన వ్యక్తం చేసినా ప్రియుడి మనస్సు కరగలేదు. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులూ పెళ్లికి ససేమిరా అన్నారు. 
 
దీంతో మహిళా సంఘాల సభ్యురాలు నవీన్‌ కుమార్‌తోపాటు అతని తల్లిదండ్రులను నిలదీశారు. పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టారు. లేకపోతే బలవంతంగా తాళికట్టిస్తామంటూ సదరు యువకుడి ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతున్న నవీన్‌కుమార్‌ను అడ్డుకున్నారు. తాళి కట్టాలంటూ రోడ్డు మీదే నిలదీశారు. బలవంతంగా తాళి కట్టించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అతను నిరాకరించాడు. 
 
మరోవైపు ఆ యువకుడి తల్లిదండ్రులు నీవు తాళికడితే తాము ఆత్మహత్య చేసుకుంటామని రోడ్డుపైనే బెదిరింపులకు దిగారు. దీంతో సదరు యువకుడు తాళికట్టేందుకు పూర్తి స్థాయిలో నిరాకరించాడు. ఈ నేపథ్యంలో వన్‌టౌన్‌ పోలీసులు జోక్యం చేసుకొని ప్రియుడు, ప్రియురాలితో పాటు వారి తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. పొద్దుపోయే దాకా ప్రేమికులిద్దరికీ వేర్వేరుగా కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా దీనిపై ప్రియుడు నవీన్ కుమార్ స్పందిస్తూ.. తామిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమే. నాలుగు సంవత్సరాల నుంచి ఆమె ప్రవర్తన సరిగా లేదు. ఈ క్రమంలో నన్ను ఎన్నో ఇబ్బందులు, అవమానాలకు గురిచేసింది. ఏదేదో చేస్తానంటూ బెదిరించింది. మీ కుటుంబాన్ని బాజారుకు ఈడుస్తానని బెదిరింపులకు పాల్పడుతోంది. అన్నట్లుగానే మా ఇంటి ముందుకు వచ్చి మా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చింది. ఇంక మాకు ఏ మర్యాద మిగిలింది. మా అమ్మా, నాన్నలు ఏమవుతారోనని భయంగా ఉందని చెప్పుకొచ్చారు.