శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (09:31 IST)

అభివృద్ధిలో నూతన విప్లవానికి చంద్రబాబు నాంది: గోయల్

అభివృద్ధిలో నూతన విప్లవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాందీ పలుకుతారని, బాబు పాలనలో రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆకాంక్షించారు. లేక్‌వ్యూ అతిథి గృహంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం 247 నిరంతర విద్యుత్తు, 4000 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ప్లాంట్‌, 2500 మెగావాట్ల సోలార్‌ అల్ట్రామెగా పార్కు ఏర్పాటు వంటి వాటికి సంబంధించిన అవగాహన ఒప్పందాల(ఎంఓయు) కార్యక్రమానికి పీయూష్‌ గోయల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ- సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. బాబు వంద రోజుల పాలన సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తాను పాల్గొన్నందుకు గర్వపడుతున్నానన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ చంద్రబాబు ‘రోల్‌ మోడల్‌ సీఎం’ అని అభివర్ణించారు. బాబు వంద రోజుల పాలనపై ముద్రించిన ప్రత్యేక సంచిక తనను ఆకట్టుకుందన్నారు. అందులో విద్యుత్తు రంగానికి ప్రాధాన్యమివ్వడం ఆ శాఖ మంత్రిగా తనకు గర్వంగా ఉందన్నారు. 
 
ఈ పుస్తకంలో ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని పేర్కొనడాన్ని తాను తప్పుబడుతున్నానన్నారు. ఏపీ అడుగులు వేయడం లేదని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని చమత్కరించారు. వేదికపై ఉన్న బాబు తన కుడివైపునున్న సుజనా చౌదరిని చూస్తూ కళ్లెగరేసి ఏమంటున్నారో చూశారా? అని ప్రశ్నించారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బాబు రాష్ట్ర సమస్యల చిట్టాతో తన వద్దకు వచ్చారని, అదే సమయంలో సోలార్‌ పార్కు ప్రతిపాదనను తీసుకొచ్చి, కేంద్ర సహకారం కోరారని చెప్పారు. ఇది జరిగిన 50 రోజులకే సోలార్‌పార్కుకు భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.