గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (11:10 IST)

చంద్రబాబు జపాన్ పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు వెంట జపాన్ పర్యటనలో 18 మంది ప్రభుత్వ ప్రతినిధులున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జపాన్ పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం టోక్యో నగరానికి చేరుకుంటారు. అక్కడ అగ్రికల్చర్ మిషనరీ అండ్ ఎక్వీప్‌మెంట్ బిజినెస్ ఎండి నోయోకి కొబాయషితో సమావేశమవుతారు. 
 
25వ తేదీ మంగళవారం ఓసాకి సిటీలో వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. పానాసోనిక్ డివిడి కంపెనీ ప్రతినిధులతో బాబు సమావేశమవుతారు. ఓసాకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌ మీటింగ్‌లో, ఇండియా ఐటీ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం టోక్యో నగర మేయర్‌తో సమావేశమవుతారు. 
 
26వ తేదీన నకాట నగరంలో పర్యటించి, ఆ నగర మేయర్‌తో సమావేశమవుతారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రదేశాన్ని సందర్శించడంతోపాటు సమీపంలోనే ఉన్న ఫుకూడా టవర్, కిటక్యూషు నగరాన్ని కూడా సందర్శిస్తారు. 27వ తేదీన జపాన్ ప్రధానితోపాటు మంత్రుల బృందాన్ని చంద్రబాబు నాయుడు బృందం కలుస్తుంది. ఇసుజీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. అలాగే జైకా కంపెనీ, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్పొరేషనల్‌ ప్రతినిధులను కూడా కలుస్తారు.