శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (13:32 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు తప్పనిసరి : యనమల రామకృష్ణుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రకటించనున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందాలనుకునే ప్రజలకు ఆధార్ కార్డు ప్రామాణికమని యనమల తెలిపారు.
 
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆయన బుధవారం ప్రవేశపెట్టారు. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలు, బంగారు రుణాలపై... ఒక కుటుంబానికి 1.50 వేల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో యనమల ప్రకటించారు. అలాగే స్వయం సహాయక గ్రూపులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. అయితే రుణమాఫీ జరగాలంటే రైతులు, స్వయం సహాయక గ్రూపులు కచ్చితంగా ఆధార్ కార్డ్ పొంది ఉండాలన్న షరతు విధించారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా పొలాలకు అవసరమైన చోట నీరు అందిస్తామన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి 5 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. పల్లెటూర్లలో కూడా త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 
 
రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేయనున్నామన్నారు. అలాగే... కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నామని తెలిపారు. 'ఈ-బిజ్' కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 
 
ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటిని చిత్తూరు, కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూజివీడు, కడపలో ట్రిపుల్ ఐటీలున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు వీటిపై మక్కువ చూపుతుండడంతో అదనంగా మరో రెండు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.
 
శాఖలవారీ కేటాయింపులు ఇలా ఉన్నాయి. 
 
నీటిపారుదల శాఖకు రూ.8,465 కోట్లు
హోం శాఖకు రూ.3,734 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.4,260 కోట్లు 
పట్టణాభివృద్ధి శాఖకు రూ.3,134 కోట్లు
వెనుకబడిన తరగతలు సంక్షేమానికి రూ.3,130 కోట్లు
విపత్తు నిర్వహణకు రూ. 403 కోట్లు
ఐటి శాఖకు రూ.111 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.615 కోట్లు
 
గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,115 కోట్లు
ఇంధన శాఖకు రూ.7,164 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.371 కోట్లు
యువజన సర్వీసుల శాఖకు రూ.126 కోట్లు
మహిళా సంక్షేమ శాఖకు రూ.104 కోట్లు
వికలాంగుల సంక్షేమం, వృద్ధులకు రూ.65 కోట్లు
గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,150 కోట్లు
 
మౌలిక వసతులకు రూ.73 కోట్లు
రోడ్లు, భవనాలు శాఖకు రూ.2,612 కోట్లు
అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.418 కోట్లు
ఇంటర్మీడియట్ విద్యాకు రూ.812 కోట్లు 
ఉన్నత విద్యకు రూ.2,275 కోట్లు 
పాఠశాల విద్యకు రూ.12,595 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.4,388 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు