గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:44 IST)

రాజధాని కృష్ణ - గుంటూరు మధ్యే.. కారణాలు వివరించిన నారాయణ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తోంది. ఈ విషయాన్ని రాజధాని ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్, ఏపీ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ రాజధానికి ఈ ప్రాంతం ఎందుకు ఉత్తమమైనదో ఆయన వివరించారు. 
 
కృష్ణా - గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో ఉండడంతోపాటు నీటి వసతి, విమానా శ్రయాలు, రైలు, రోడ్డు సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వారికి వివరించామన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వచ్చే నెలాఖరున శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో రాజధానికి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీని మరోమారు కోరినట్టు ఆయన తెలిపారు. 
 
దీంతో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ అన్న మీమాంస దాదాపుగా తొలగినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని నిర్మాణం జరిగితే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరచూ చెబుతుండటంతో పాటు పార్టీ శ్రేణులతోనూ ప్రచారం చేయించారు. తాజాగా పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ఏర్పాటైన రాజధాని సలహా కమిటీ చేత కూడా చంద్రబాబు అదే మాట చెప్పించారు. అది కూడా ఏకంగా రాజధాని నిర్ణయానికి సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ముందు. అంటే కేంద్రానికి పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. 
 
చంద్రబాబు కేంద్రంలో కొత్తగా పాలనపగ్గాలు చేపట్టిన బీజేపీతో ఎలాగూ పొత్తు పెట్టుకోవడంతో, అక్కడ ఆయన మాట వీగిపోయే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ‘ఇలా చేసేయండి, దీనినే మీరూ ప్రతిపాదించండి’ అన్న చందంగా మంగళవారం నారాయణ కమిటీతో శివరామకృష్ణన్‌ కమిటీకి చెప్పిం చేశారు. 'రాజధాని ఎక్కడన్న విషయం మీరు నిర్దేశించినా, ఆ తర్వాత దానిని అభివృద్ధి చేసుకోవాల్సింది మేమే కదా, మాకు అనుకూలమైన ప్రదేశాన్నే మీరు కూడా ప్రతిపాదిస్తే, వీలైనంత తొందరగా పనులు ప్రారంభించుకోవడంతో పాటుగా మీరు ఊహించని రీతిలో అభివృద్ధి చేసుకుంటాం’
అంటూ మంత్రి నారాయణ, శివరామకృష్ణన్ కమిటీకి తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  
 
శివరామకృష్ణన్ కమిటీని ఒప్పించేందుకు నారాయణ కమిటీ పలు అంశాలను ప్రస్తావించిందట. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘ఆ ప్రాంతం’ సమాన దూరంలో ఉంటుందని, ఇప్పటికిప్పుడు కూడా అక్కడ స్వల్ప ఏర్పాట్లతో పాలన సాగించే అవకావశాలు కూడా అందుబాటులోనే ఉన్నాయని వివరించినట్లు సమాచారం. ఎక్కడో విశాఖలో రాజధాని ఏర్పాటైతే రాయలసీమ జిల్లాలకు దూరాభారం పెరగడమే కాక, అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదని చెప్పుకొచ్చారట. 
 
ఇక భూ లభ్యత విషయాలను తాము చూసుకుంటామని, నీటి వసతి, విద్యుత్తు అందుబాటు తదితర అంశాలకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పేందుకు ఓ నివేదికనే ఆయన ముందుంచారట. అసలే రాష్ట్రంలో అధికార పక్షం. అందునా కేంద్ర సర్కారుకు మిత్రపక్షంగా ఉన్నపార్టీ నేతలు, కాదనకపోతే ఎలా అనుకున్నారో, ఏమో, శివరామకృష్ణన్ కూడా చేసేదేమీ లేక తలాడించినట్టు సమాచారం.