శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:34 IST)

విజయవాడపై విభేదాలు : కేఈ కృష్ణమూర్తి వర్సెస్ పి నారాయణ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పి నారాయణల మధ్య మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. విజయవాడే రాజధాని అని మంత్రి నారాయణ తొందరబడి మాట్లాడాల్సి అవసరం ఏముందని అసెంబ్లీ లాబీలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఆయన ప్రకటన వల్లే భూములు ధరలు పెరిగాయని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 
 
విజయవాడ తాత్కాలిక రాజధాని అని మాత్రమే చెప్పామని వెల్లడించారు. అక్కడ ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని, అయితే విజయవాడే రాజధాని కావాలని మంత్రి నారాయణ పదేపదే ఎందుకు ప్రకటన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
ఇదేసమయంలో జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను మంత్రి కేఈ కృష్ణమూర్తి వివరించారు. విజయవాడలో ప్రభుత్వ భూములు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని, మొత్తం 500 ఎకరాలలోపే భూమి అందుబాటులో ఉందన్నారు. కర్నూలుకు 10 కిలోమీటర్ల పరిధిలో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇతర ఏ జిల్లా కేంద్రంలోనూ ఇంత భూమి అందుబాటులో లేదని ఆయన తెలిపారు. కర్నూలును రాజధాని చేయాలని తాను అడగటం లేదన్నారు. 
 
రాజధానిపై మొదట్లో గుంటూరు-విజయవాడ అన్నారని, ఇప్పుడు విజయవాడ అంటున్నారని కేఈ వ్యాఖ్యానించారు. విజయవాడ-గుంటూరు మధ్య కేవలం 500 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందని గుర్తు చేశారు. దీనివల్ల  రాజధానిపై గందరగోళం ఏర్పడిందని, రాజధానిపై కసరత్తు పూర్తి అయ్యేందుకు ఏడాది సమయం పడుతుందన్నారు. కాగా, జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వం భూముల వివరాలను ఆయన వెల్లడించారు. 
 
శ్రీకాకుళం జిల్లాలో 177 ఎకరాలు, విజయనగరంలో 581 ఎకరాలు, విశాఖపట్నంలో 1473, తూర్పుగోదావరిలో 204 ఎకరాలు, పశ్చిమగోదావరిలో 79 ఎకరాలు, కృష్ణాలో 3247 ఎకరాలు, గుంటూరులో 2012 ఎకరాలు, ప్రకాశంలో 559 ఎకరాలు, నెల్లూరులో 5823 ఎకరాలు, చిత్తూరులో 2050 ఎకరాలు, కడపలో 689 ఎకరాలు, కర్నూలులో 4975 ఎకరాలు, అనంతపురంలో 4270 ఎకరాలు చొప్పున అందుబాటులో ఉన్నాయని కృష్ణమూర్తి వివరించారు.