శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (18:59 IST)

ఎంసెట్ కౌన్సిలింగ్‌ ప్రక్రియ స్టార్ట్ : 7 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ముందడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. అయితే, సోమవారం జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. అయినా కోరం ఉన్నందున కౌన్సెలింగ్ తేదీలపై నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. ధ్రువపత్రాల పరిశీలన ముగిసే లోపు తమ నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముందు ఉంచుతుంది. కౌన్సెలింగ్‌కు అవసరమైన చర్యలు పూర్తి చేయాలని కూడా ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, ఈ సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాంకేతిక విద్యా కమిషనర్ హాజరు కావాల్సి ఉండగా, వారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గైర్హాజరైనట్టు సమాచారం. తగిన సిబ్బంది లేకపోవడంతో ఇంజనీరింగ్ కౌన్సెలింగులో జాప్యం జరుగుతోందని, అయితే విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ ప్రక్రియకు తేదీలు ప్రకటించడం విశేషం.