శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

ఈ రెండేళ్ళ పదవి నాకొద్దు... ఎమ్మెల్సీ నిరాకరించిన అనురాధ.. చంద్రబాబుకు షాక్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ షాకిచ్చారు. పదవి కావాలని అందరూ వెంటపడుతుంటే తనకు ఆ ఎమ్మెల్సీ పదవి వద్దని అనురాధ తెగేసి చెప్పారు. చెప్పడమే కాదు నామినేషన్ కూడా వేయలేదు. తెలుగుదేశం పార్టీ వెంటనే తేరుకుని మరో అభ్యర్థిని రంగంలోకి దింపింది. వివరాలిలా ఉన్నాయి.
 
మాజీమంత్రి పాలడుగు వెంకట్రావు మృతి కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా అనూరాధను చంద్రబాబు కోరారు. అయితే.. కేవలం రెండేళ్ల గడువు మాత్రమే ఉన్న ఆ స్థానానికి తాను పోటీ చేయబోనని అనూరాధ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, అంతే తప్ప, ఇలా రెండేళ్లకు మాత్రమే పరిమితమయ్యే పదవి తనకు వద్దని ఆమె చెప్పినట్లు సమాచారం.
 
విజయవాడ మేయర్గాను, ఆ తర్వాతి కాలంలో కూడా తెలుగుదేశం పార్టీలో పంచుమర్తి అనూరాధ క్రియాశీలకంగా వ్యవహరించారు. 25 ఏళ్ల వయసులోనే విజయవాడ నగరానికి తొలి మహిళా మేయర్‌గా 2000 నుంచి 2005 వకూ బాధ్యతలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. టీడీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఉన్న ఐదు స్థానాల్లో నాలుగు గెలుచుకునే అవకాశం ఉంది. దాంతో సొంత పార్టీ నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి ఈ పదవులను ఇవ్వాలని నాయకత్వం భావించింది. 
 
బీజేపీ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సోము వీర్రాజు పేరు దాదాపు ఏకగ్రీవంగానే ఖరారు చేశారు. ఇక తమ సొంత పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా.. అందులో ఒక స్థానాన్ని అనూరాధకు ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ, ఆమె నిరాకరించడంతో మరో ముగ్గురు నాయకులను ఎంపిక చేసుకుని.. వారితో నామినేషన్లు దాఖలు చేయించారు.  ప్రతిభాభారతి, ఎంఎ షరీఫ్, టీడీ జనార్ధనరావు ఈ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పంతం నెగ్గించుకున్న అనూరాధ.. ఈ ఎన్నికలకు దూరంగా ఉండి.. పూర్తి కాలం పాటు అంటే ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉండే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.