శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 23 ఆగస్టు 2014 (13:30 IST)

సూటిగా అడుగుతున్నా... వంగవీటిని బాబు చంపించారు... అసెంబ్లీ ముందు జగన్

పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శాంతిభద్రతలపై చర్చ తిరిగి ప్రారంభమైన తర్వాత శనివారం ఉదయం ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో టిడిపి సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతున్నారనీ, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఇవాళ అసెంబ్లీలో బఫూన్ కామెంట్లపై జగన్ సారీ చెప్పాలంటూ తెదేపా పట్టుబట్టగా జగన్ ససేమిరా అన్నారు. తనను 18సార్లు దుర్భాషలాడినా పట్టించుకోని స్పీకర్ కోడెల తాను ఒక్కసారి బఫూన్ అన్నందుకు తమ పట్ల వివక్ష చూపుతూ ఉన్నారంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ వైఖరికి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్ అసెంబ్లీ గేటు ముందు నిరసనకు దిగారు. 
 
జగన్ మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 18 సార్లు దుర్భాషలాడితే పట్టించుకోరు, ఒక్కసారి మాట్లాడితే మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారంటూ స్పీకరునుద్దేశించి అన్నారు. బడ్జెట్ గురించి మాట్లాడకుండా టాపిక్ మార్చేశారనీ, ప్రతిపక్షాన్ని స్పీకర్ ఇలా చూడటం ఇదే ప్రథమమనీ, వాకౌట్ చేస్తున్నామని చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలోనే ఇలా రోడ్డుపైకి వచ్చినట్లు జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
 
తాను 14 మర్డర్లపై మాట్లాడితే 10 ఏళ్ల కిందటివి గురించి మాట్లాడుతున్నారనీ, పరిటాల రవి హత్య గురించి విచారణ జరిగిందనీ, దోషులకు శిక్ష పడిందనీ, దాని గురించి ఇంకా ఎందుకు చర్చిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసలు పరిటాల హత్యలో పాత్రధారులంటూ ఆరోపించిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు తెలుగుదేశం పార్టీలో సీట్లు ఎందుకిచ్చారంటూ నిలదీశారు. 
 
వంగవీటి మోహన రంగారావును చంద్రబాబు దగ్గరుండి చంపించారనే ఆరోపణలున్నాయని, దాని గురించి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. రంగా హత్యలో 11వ ముద్దాయి, ఎమ్మెల్యే రామకృష్ణారావు బాబు పక్కన కూర్చుని ఉన్నారని అన్నారు. వంగవీటి హత్యకు బాధ్యత వహిస్తూ ఆనాడు కోడెల రాజీనామా చేయలేదా అంటూ అడిగారు.