గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:49 IST)

శభాష్ సాంబశివరావు... 8 మంది సీఎంల మన్ననలు పొందిన అధికారి

అమరావతి : నీతికి, నిజాయితీకి, నిక్కచ్చితనానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు నిలువెత్తు నిదర్శనమని ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి, వారి మన్ననలు అంద

అమరావతి : నీతికి, నిజాయితీకి, నిక్కచ్చితనానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు నిలువెత్తు నిదర్శనమని ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి, వారి మన్ననలు అందుకున్న అధికారి అని ప్రశంసించారు. అసెంబ్లీలోని మొదటి అంతస్తులో ఉన్న కమిటీ హాల్‌లో నిత్యస్ఫూర్తి పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రసంగించారు. విధి నిర్వహణలో రాజీ లేనితత్వం సాంబశివరావుది అని అన్నారు. 
 
ఆయన ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. ఆరోగ్యమంత్రిగా తాను పనిచేస్తున్న సమయంలో సాంబశివరావు ఆ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించేవారన్నారు. రాజీలేని ధోరణితో, విమర్శలకు తావు లేకుండా విధులు నిర్వర్తించారన్నారు. ఆయన పనితీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఎంతో నిబద్ధతతో వ్యవహరించే వారి జీవిత విశేషాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ శాఖల్లో క్లిష్టమైనవి విద్య, ఆరోగ్యశాఖలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అటువంటి శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా సాంబశివరావు తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. 
 
8 మంది ముఖ్యమంత్రులతో ఆయన కలిసి పనిచేశారన్నారు. ముఖ్యమంత్రులు ఏ పని అప్పజెప్పినా నిబద్ధతతో పూర్తి చేసేవారన్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రుల మన్ననలు పొందిన అధికారిగా గుర్తింపు పొందారన్నారు. కింది ఉద్యోగులకు కూడా ఆయన తన పనితీరుతో మార్గదర్శకంగా నిలిచారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. పూరిపాకల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. పశువైద్య డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సాంబశివరావు నేడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు ఆశించాలని స్పీకర్ ఆకాంక్షించారు. బాల్యంలోని కష్టాలు నేటి తీపి గుర్తులుగా ఉంటాయన్నారు. 
 
సాంబశివరావు జీవితంలో ఎత్తు పల్లాలు ప్రజలకు, భావితరాలకు తెలియాల్సి ఉందన్నారు. బాల్యంలో విద్యాభ్యాసం కోసం సాంబశివరావు పడిన కష్టాలు 40 ఏళ్లనాటి విద్యా వ్యవస్థను కళ్లకు కడుతున్నాయన్నారు. నిత్యస్ఫూర్తి పుస్తకంలోని ప్రతి అక్షరమూ తనను ఎంతో ప్రభావితం చేసిందన్నారు. సాంబశివరావు జన్మస్థలమైన గొల్లనపల్లి గ్రామస్తులు ఎందరో నిజాం వ్యతిరేక పోరాటంలోనూ, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారన్నారు. నిత్యస్ఫూర్తి పుస్తకంతో సాంబశివరావు జీవిత విశేషాలను అందించిన ఆ పుస్తక రచయిత రామకృష్ణను అభినందించారు. 
 
పూర్వ విద్యార్థుల సంఘాలతో ఎంతో ఉపయోగం కలుగుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఏడాదికి ఒకసారయినా పూర్వ విద్యార్థులు కలుసుకోవడం వల్ల తాము జన్మించిన గ్రామంతో పాటు వ్యక్తిగతంగానూ ఎంతో మేలు కలుగుతుందన్నారు. తమ గ్రామంలో ఏటా సంక్రాంతికి పల్లెకు పోదాం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశ విదేశాల్లో ఉన్నవారందరూ తమ భార్యాబిడ్డలతో సంక్రాంతి రోజున స్వగ్రామానికి వస్తుంటారన్నారు. వారంతా ఇచ్చే విరాళాలతో తమ గ్రామంలో రూ.3 నుంచి 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
 
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు మాట్లాడుతూ, పుస్తక రచనలో తనకు సంబంధించిన వివరాలేవీ అందించలేదన్నారు. రచయిత, గొల్లనపల్లి గ్రామస్తులే సేకరించి పుస్తకాన్ని ముద్రించారన్నారు. టీటీడీలో చేపట్టిన సంస్కరణలతో తలనీలాలకు భక్తులు గంటల తరబడి నిలబడాల్సిన కష్టం తప్పిందన్నారు. కష్టపడి పనిచేస్తే అద్భుతాలు సాధించొచ్చునన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా విధులు చేపట్టే సమయానికి పాస్‌బుక్‌ల పంపిణీలో అట్టడుగున ఉండేదన్నారు. జిల్లాలో వీఆర్వోలతో కలిసి చిత్తశుద్ధితో పని చేసి రాష్ట్రంలో నెల్లూరును మొదటిస్థానంలో నిలిపామన్నారు. 
 
ఇలా పని చేసిన అన్ని శాఖల్లోనూ కింది స్థాయి అధికారులతో కలిసి ఆ శాఖల నుంచి ఉత్తమ ఫలితాలు సాధించామని సాంబశివరావు తెలిపారు. అన్ని శాఖల్లోనూ ఉత్తమ అధికారులు ఉంటారన్నారు. వారిని ఉత్తేజపర్చడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించొచ్చునన్నారు. భూ సమీకరణ సమయంలో ప్రజల నుంచి ఎంతో వ్యతిరేకత వస్తుందన్నారు. తాను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించామన్నారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిబంధనలు రూపొందించామని, దీనివల్ల 33 వేల ఎకరాలకు పైగా భూములను ఎటువంటి వివాదాలు లేకుండా సేకరించాగలిగామని అన్నారు. 
 
ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనది, సాంబశివరావుది గన్నవరం నియోజకవర్గమేనన్నారు. మాటలు తక్కువగా మాట్లాడి పని ఎక్కువగా చేసే అధికారి ఆయన అని కొనియాడారు. సాంబశివరావు ఏ శాఖలో ఉన్నా, ఆ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేస్తారన్నారు. భావితరాలను ఆయన స్ఫూర్తివంతంగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు, పుస్తక రచయిత రామకృష్ణ, గొల్లనపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 1974-75 పదో తరగతి విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.