శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (16:54 IST)

వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించమని స్పీకర్ చెప్పలేదట.. తీసేస్తే మిన్నకుంటారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని తొలగించమని తాను చెప్పలేదని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ సీఎంలకు చెందిన చిత్ర పటాలు తొలగించాలా? లేదా అనేది నియమనిబంధనల ప్రకారం జరుగుతుందన్నారు. అయితే ఈ విషయంలో కేవీపీ నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని తెలిపారు. తాను సంప్రదాయం ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నానని కోడెల పేర్కొన్నారు.
 
అయితే వైఎస్సార్ ఆత్మబంధువు కేవీపీ స్పీకర్ కోడెలకు లేఖ రాసినట్లు బుధవారం ఉదయం మీడియాల్లో వార్తలొచ్చాయి. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడంపై కేవీపీ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇలా చిత్రపటాలను తొలగించుకుంటూ పోతే పరిస్థితి తారుమారవుతుందని కేవీపీ కోడెలకు లేఖలో గుర్తు చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దివంగత నేత వైఎస్సార్ చిత్రపటాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.
 
మరణించిన నేతల చిత్రపటాలను తొలగించడం సంప్రదాయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే వైఎస్సార్ చిత్రపటాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని, వైఎస్సార్ చిత్ర పటాన్ని తొలగించేందుకు ఏ నిబంధనలు అడ్డుపడ్డాయని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతులకు అనుగుణంగా రాజకీయ నేతలు వ్యవహరించాలని వారు హితవు పలుకుతున్నారు. మరి టీడీపీ సర్కారు వైఎస్సార్ చిత్రపటాన్ని తొలగించడంపై ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.