శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 8 జులై 2016 (20:45 IST)

చెట్లు నరుకుతున్న దుండగులను పట్టుకున్న ఏపీ స్పీకర్ కోడెల

ఒకవైపు ప్రభుత్వం పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా....గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం - నరసరావుపేట మార్గంలో శుక్రవారం ఉదయం భారీ వృక్షాలు నరికివేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఫిరంగిపురం సమీపంల

ఒకవైపు ప్రభుత్వం పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా....గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం - నరసరావుపేట మార్గంలో శుక్రవారం ఉదయం భారీ వృక్షాలు నరికివేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఫిరంగిపురం సమీపంలో చెట్లు నరికివేయడాన్ని గమనించి తన కాన్వాయ్ ఆపి.. భారీ వృక్షాల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల నాటి చెట్టును నరికివేస్తున్న దుండగులను స్పీకర్ స్వయంగా పట్టుకుని పోలీసులకు పట్టించారు.
 
శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి నరసరావుపేట వెళుతున్న స్పీకర్‌కు రోడ్డు పక్కన చింతచెట్లను నరికివేస్తూ కొంతమంది కంటపడ్డారు. వెంటనే స్పీకర్ కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. ఆయనను చూడగానే దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించగా సెక్యురిటీ సిబ్బంది పట్టుకున్నారు. స్పీకర్‌ కోడెల నిందితులను స్వయంగా తన కారులో ఎక్కించుకుని వెళ్లి పోలీసులకు పట్టించారు. 
 
నరికివేస్తున్న ముఠాను శభాపతే స్వయంగా పట్టుకోవటం ఇక్కడి ప్రత్యేకత. తన విచారణలో కలప వ్యాపారానికే చెట్లు నరికివేస్తున్నారని తేలడంతో వారిని ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌కు పంపారు. మొక్కలు నాటడమే కాదు... చెట్లను కాపాడటమూ అధికారుల బాధ్యతేనని, ఆర్‌అండ్‌బీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కిందిస్థాయి సిబ్బంది, కలప మాఫియా కుమ్మక్కై వృక్షాలను నరికేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రానున్న వర్షాకాల శాసన సభ సమావేశాల్లో చర్చను చేపడతామన్నారు.