గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (10:48 IST)

ఏపీ స్థానికతపై చంద్రబాబు స్పష్టీకరణ : ఆ కాల వ్యవధిలోపు తరలివచ్చేవారికే...

నవ్యాంధ్రప్రదేశ్ర రాజధాని అమరావతిలో విధులు నిర్వహించేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి తరలివచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు స్థానిక (నేటివిటీ) ఇచ్చే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ స్పష్టత ఇచ్చారు. 2017 జూన్ రెండో తేదీలోపు తరలి వచ్చే వారికి మాత్రమే స్థానికత కల్పిస్తామని ఆయన తేల్చి చెప్పేశారు. 
 
ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటున్న వారి స్థానికత అంశంపై స్పష్టతనిచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాల వారికీ రెండున్నరేళ్ళ కాల వ్యవధిలో వచ్చే వారికి స్థానికత కల్పించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
ఈ నిర్ణీత సమయంలో వచ్చిన వారికే స్థానికత కల్పించాలని, రాని వారికి అవకాశం ఇవ్వలేమని స్పష్టంగా ప్రకటించింది. తెలంగాణ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులకు స్థానికత కల్పించే విషయంలో మరింత సుదీర్ఘకాలం వ్యవధి ఇస్తే అనేక అనర్థాలు సంభవిస్తాయని కేబినెట్‌ అభిప్రాయపడింది. 
 
ఇంత తక్కువ కాల వ్యవధి నిర్ణయించడానికి కూడా కారణం లేకపోలేదు. సుదీర్ఘ సమయం ఇస్తే అక్కడ మెడికల్‌ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తారని, ప్రభుత్వ ఉద్యోగులైతే 58 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే ముందు ఇక్కడ 60 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుందని కేబినెట్‌ అభిప్రాయపడింది. స్థానికత విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నకారాదన్న ఉద్దేశంతోనే రెండున్నర సంవత్సరాల అవకాశం కల్పించామని, రాష్ట్రపతి ఆదేశాలను కూడా పరిశీలించి, చట్టపరంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.