గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (15:33 IST)

వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్ ప్రారంభం... ఆరగించిన చంద్రబాబు : ధరల్లో తమిళనాడే బెస్ట్!

పేద ప్రజల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మా క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. ఈ క్యాంటీన్లకు ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ, స్పందన వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత

పేద ప్రజల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మా క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. ఈ క్యాంటీన్లకు ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ, స్పందన వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఇదే తరహా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం వెలగపూడిలో ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయగా, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు. ఏపీ మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, రావెల కిశోర్‌బాబు తదితరులు క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాల ఏర్పాటుచేశారు. 
 
ఈ క్యాంటీన్ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. క్యాంటీన్‌లో ధరలు 2 ఇడ్లీ రూ.3లు, పొంగల్‌ రూ.5లు, ఉప్మా రూ.5లు, పులిహోర రూ.5లు, సాంబారు అన్నం రూ.7లు, పెరుగన్నం రూ.5లు, చపాతీ రూ.4లుగా నిర్ణయించారు.
 
అయితే, అమ్మ క్యాంటీన్లతో పోల్చుకుంటే ఎన్టీఆర్ క్యాంటీన్లలో ధరలు కాస్తంత ఎక్కువగా నిర్ణయించారు. అయినప్పటికీ.. ఈ క్యాంటీన్లకు రోజుకు 400 నుంచి 500 మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమన్నారు.