గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 25 జూన్ 2016 (21:39 IST)

డ్రాగన్ దేశానికి హైటెక్ సీఎం.. ఈ నెల 30 వరకు చైనాలో చంద్రబాబు

అమరావతి, జూన్ 25 : ప్రపంచ ఆర్థిక వేదికలపై ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించేందుకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాలకు బయల్దేరుతున్నారు. ఇప్పటివరకు జరిపిన పెట్

అమరావతి, జూన్ 25 : ప్రపంచ ఆర్థిక వేదికలపై ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించేందుకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాలకు బయల్దేరుతున్నారు. ఇప్పటివరకు జరిపిన పెట్టుబడుల ఆకర్షణ యాత్రలన్నీ ఫలించి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఒక్కొక్కటిగా ఏపీలో కాలుమోపుతున్న వేళ రెట్టించిన ఉత్సాహంతో తన బృందాన్ని తీసుకుని మరోసారి డ్రాగన్ సీమలో అడుగు పెడుతున్నారు.
 
‘కొత్త ఛాంపియన్ల వార్షిక సదస్సు’ పేరుతో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమాల్లో పాల్గొని వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ముఖ్యవక్తగా కీలక ప్రసంగాలు చేయడమే కాకుండా ప్రఖ్యాత సంస్థల అధిపతులు, వాణిజ్యవేత్తలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ప్రపంచ ఆర్థికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు జరుపుతారు. ఏ వేదిక మీదకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ వనరులు, పెట్టుబడులకు గల అపార అవకాశాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ముఖ్యమంత్రి ఈసారి పర్యటనలో కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా చూపే వారి కోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో సంసిద్ధమవుతున్నారు. 
 
శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు రాత్రి 10:45కు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంగ్‌కాంగ్ బయల్దేరుతారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:25 గంటలకు హాంగ్‌కాంగ్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ముఖ్యమంత్రి బృందం అదేరోజు సాయంత్రం 4:35కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగే టియాంజిన్ నగరానికి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముఖ్యమంత్రి బృందం అసలు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7:30 నుంచి 10 గంటల వరకు వరుసగా ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. శ్రీలంక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి సమర విక్రమతో భేటీ అవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్‌తో సమావేశమవుతారు.
 
సోమవారం ఉదయమే వాణిజ్యప్రముఖులతో జరిపే ముఖాముఖి సమావేశాలతో మళ్లీ ముఖ్యమంత్రి బృందం కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. 5:45 గంటల వరకు వరుస సమావేశాలు జరుపుతారు. అదేరోజు సాయంత్రం డబ్లుఈఎఫ్ వేదికగా ‘సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్’ అనే అంశంపై ముఖ్య ప్రసంగం చేస్తారు. తరువాత ‘షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా’ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే ‘షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్’ అనే అంశంపై జరిగే చర్చాగోష్ఠిలో పాల్గొంటారు.
 
28వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి  బృందం టియాంజిన్ నుంచి గుయాంగ్ నగరానికి వెళుతుంది. అక్కడ అర్బన్ ప్లానింగ్ ఎగ్జిబిషన్ మ్యూజియం సందర్శించి, గుయాంగ్ ఇంటర్నేషనల్ ఎకో కాన్ఫరెన్స్ సెంటర్‌కు చేరుకుంటారు. జీఐఐసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి ప్రతినిధులతో సమావేశమవుతారు.  జీఐఐసీ విజయవాడలోని స్వరాజ్య మైదానం ప్రాంతాన్ని సిటీ స్క్వేర్ పేరుతో వరల్డ్ ఐకానిక్ కట్టడంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే తలమానికంగా జీఐఐసీ సిటీస్క్వేర్‌ను నిర్మిస్తోంది. విజయవాడ నగరానికి ఇది ముఖ్య ఆకర్షణగా వుంటుంది. 
 
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఇప్పుడున్న స్థలానికి రెండున్నర రెట్ల  వైశాల్యంలో సిటీ స్క్వేర్ నిర్మాణాన్ని  చేపట్టడానికి చైనీస్ కంపెనీ జీఐసీసీ రూపొందించిన నమూనాను ముఖ్యమంత్రి గత మే 22న ఆమోదించారు. 29 వ తేదీ బుధవారం ముఖ్యమంత్రి బృందం గిజూ కొత్త నగరాన్ని సందర్శిస్తుంది. గిజూ ప్రావిన్స్ నాయకులతో సమావేశమవుతుంది. గిజూ-ఏపీ మధ్య సోదర  రాష్ట్ర సంబంధాలపై ఉభయుల మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. 30వ తేదీ గురువారం ఏపీలో గల అవకాశాలపై గిజూ నగరంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి పదిన్నరకు హాంగ్‌కాంగ్ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ విమానం ఎక్కడంతో ముఖ్యమంత్రి బృందం చైనా పర్యటన  ముగుస్తుంది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచదేశాలను భాగస్వాముల్ని చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్న క్రమంలో చేపట్టిన ఈ చైనా యాత్ర పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాలకు ఎన్నో ఆశలు కల్పిస్తోంది. అమరావతి నగర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు డ్రాగన్ దేశం ఇప్పటికే తన ఆసక్తిని వ్యక్తం చేసింది.