గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 24 ఏప్రియల్ 2017 (20:47 IST)

మంచికి ఆంధ్రప్రదేశ్ చిరునామా... మోసగాళ్ల తాటతీస్తాం... సీఎం చంద్రబాబు

అమరావతి : మోసాలకు తావులేకుండా మంచికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉండాలనేది తమ అభిమతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. డిపాజిట్లు సేకరించి, బోర్డు తిప్పేసిన విశాఖపట్నానికి చెందిన విఆర్ చిట్స్ ఆస్తులను వేలం వేయగా వచ్చిన మొత్తాలను ఆ సంస్థ బా

అమరావతి : మోసాలకు తావులేకుండా మంచికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉండాలనేది తమ అభిమతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. డిపాజిట్లు సేకరించి, బోర్డు తిప్పేసిన విశాఖపట్నానికి చెందిన విఆర్ చిట్స్ ఆస్తులను వేలం వేయగా వచ్చిన మొత్తాలను ఆ సంస్థ బాధితులకు చెక్ రూపంలో సీఎం చేతుల మీదుగా అందజేశారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. ప్రజలకు 20 నుంచి 30 శాతం అధిక వడ్డీల ఆశజూపి పలు చిట్ ఫండ్ సంస్థలు దోపిడీలకు పాల్పడుతున్నాయన్నారు. ఈవిధంగా విశాఖపట్నానికి చెందిన వీఆర్ చిట్ సంస్థ ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలకు చెందిన ప్రజల నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించిందన్నారు. 
 
కొంతకాలం సక్రమంగా వడ్డీ చెల్లించిన ఆ సంస్థ నిర్వాహాకులు తరవాత బోర్డు తిప్పేశారన్నారు.  దీనివల్ల వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. ఎందరో అమాయకులు తమ కష్టార్జితాన్ని వీఆర్ చిట్స్ లో డిపాజిట్ చేశారన్నారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇంకొందరు చదువుల కోసం డిపాజిట్ చేశారన్నారు. మరికొందరు వృద్ధాప్యంలో తమకు అక్కరకొస్తాయని ఆశపడ్డారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలా ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్మును దోచుకుని వీఆర్ చిట్స్ చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్, బొమ్మరిల్లు వంటి సంస్థలు ఇలాగే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, ప్రజలను మోసం చేశాయన్నారు. 
 
రాష్ట్రంలో అవినీతికి, మోసాలకు తావేలేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కోర్టు తీర్పు మేరకు వీఆర్ చిట్స్ ఆస్తులు వేలం వేయగా, రూ.26.19 కోట్లు వచ్చాయన్నారు. వాటిని ఆ సంస్థలో డిపాజిట్ బాధితులకు అందజేస్తున్నామన్నారు. ఆ సంస్థకు చెందిన మరికొన్ని ఆస్తులు త్వరలో వేలం వేస్తామని, వాటి ద్వారా మరో రూ.10 కోట్లు సమకూరే అవకాశముందని సీఎం చంద్రబాబు  తెలిపారు. ఇలా ప్రజలను మోసం చేసిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ తో పలు చిట్ ఫండ్ సంస్థల ఆస్తులను వేలం వేసి, ఆయా సంస్థల బాధితులకు తిరిగి చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. 
 
అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎందరో అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించామన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా చిట్ ఫండ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేసేవారు ఎంతటి వారైనా, ఎంతపెద్ద సంస్థయినా ఉపక్షించేది లేదని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఆయా సంస్థల ఆస్తులే కాకుండా నిర్వాహకుల సొంత ఆస్తులు కూడా జప్తు చేసి, ప్రజలకు పంచిపెట్టి తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. అవినీతి పరులకూ ఇదే గతిపట్టిస్తామన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా ఇటువంటి మోసపూరిత ప్రకటలకు లొంగిపోయి, అత్యాశకు పోకూడదని హితవు పలికారు. 
 
ముందుగా డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, 12 ఏళ్ల పాటు న్యాయం పోరాటం చేసి, వీఆర్ చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేశామన్నారు. ఇది దేశంలోనే చరిత్ర సృష్టించిన రోజన్నారు. 2005లో వీఆర్ చిట్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. 2006లో రెండు పర్యాయాలుగా  ఆ సంస్థ ఆస్తులు ఎటాచ్ చేశామన్నారు. కోర్టు తీర్పు మేరకు ఆ సంస్థ ఆస్తులు వేలం వేసి, బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు. వేలం ద్వారా రూ.26 కోట్ల వరకూ సేకరించామన్నారు. 
 
ఈ కేసు స్ఫూర్తితో మరిన్ని కేసుల్లో త్వరగా తీర్పు వచ్చేటట్లు చేసి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన స్ఫూర్తితో వీఆర్ చిట్ సంస్థ కేసులో ముందుకెళ్లామన్నారు.  అనంతరం నలుగురు బాధితులకు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా చెక్‌లు అందజేశారు. అత్తిల పార్వతికి రూ.14.62 లక్షలు, లాల విజయలక్ష్మికి రూ.1.30 లక్షలు, బి.సూర్యనారాయణకు రూ.2 లక్షలు, యలమంచిలి నారాయణరావుకు రూ.11.75లక్షలు అందజేశారు. కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన సీఐడి డిఎస్పీ  వైవి.నాయుడిని సీఎం చంద్రబాబు అభినందించారు. సీఐడి ఎస్ఐ పీవీబీ ఉదయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావు, కానిస్టేబుల్ ఎన్.రమేష్ యాదవ్ కు సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసా పత్రాలు అందజేశారు. 
 
అంతకు ముందు బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడించారు. అధిక వడ్డీలకు ఆశపడి వీఆర్ చిట్ లో డబ్బులు డిపాజిట్ చేశామని బాధితులు వాపోయారు. డబ్బులు రావనే మానసిక వేదనతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి కష్టార్జితం డిపాజిట్ చేశాడని, వీఆర్ చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చదువుకు దూరమయ్యానని ఒక యువకుడు వాపోయాడు. 
 
న్యాయం కోసం పోరాడండి...
కోర్టుల్లో న్యాయం తరఫున న్యాయవాదులు పోరాడాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. వీఆర్ చిట్ ఫండ్ బాధితుల తరఫున 12 ఏళ్ల పాటు కోర్టులో వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రామ్మూర్తినాయుడిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు న్యాయవాదులు వృత్తి ధర్మానికి కట్టుబడి ఉంటారన్నారు. కొందరు మాత్రం న్యాయం కోసం పోరాడతారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ, 1999లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు రూపొందించిన ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిస్ మెంట్ చట్టం ఆధారంగా వీఆర్ చిట్ ఫండ్ కేసులో విజయం సాధించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, సీఐడి ఐజీ ద్వారకా తిరుమలరావుతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాష్ర్ట ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు, విశాఖ నుంచి వచ్చిన 150 మంది వీఆర్ చిట్ ఫండ్ సంస్థ బాధితులు పాల్గొన్నారు.