శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (15:20 IST)

నేనేం చెడుపని చేశా.. నన్ను ఎందుకు కాల్చి చంపాలి : చంద్రబాబు ప్రశ్న

ఏపీ ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చి చంపాలంటూ వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసలు తననెందుకు చంపాలని ఆయన ప్రశ్నించారు.

ఏపీ ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చి చంపాలంటూ వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసలు తననెందుకు చంపాలని ఆయన ప్రశ్నించారు. ఒక సీఎంను రోడ్డుపై కాల్చి చంపాలంటూ పిలుపునివ్వడం ఉన్మాద మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. జగన్ ఒక శాడిస్ట్ అని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చాలని చెప్పారు.  
 
నంద్యాల ఉప ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువ చేసే బాధ్యత పార్టీ నేతలదేనన్నారు. 
 
2019 ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ఇప్పటినుంచే సమాయత్తం కావాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కార్యకర్తలెవరూ స్పందించవద్దన్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటే.. అధికారంలోకి వస్తే ఎలా ఉంటాడో ప్రజలే బేరీజు వేసుకోవాలన్నారు. 
 
‘సీఎంను చెప్పుతో కొట్టాలి, నడిరోడ్డుపై కాల్చి చంపాలి, కలెక్టర్‌ను జైలుకు పంపిస్తా, పోలీస్‌ కమిషనర్‌ పింఛన్‌ ఆపేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేయడం ఉన్మాదం కాక మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ ఉన్మాది అనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా 30 సీట్ల కంటే ఎక్కువ గెలిచేది లేదని సర్వేలన్నీ చెబుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.