శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2015 (08:58 IST)

హస్తిన చేరిన ఉమ్మడి గవర్నర్... ఎందుకో...?

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఒకవైపు ప్రత్యేకహోదా మరోవైపు రాష్ట్రాల మధ్యన తగువులు.. మరోవైపు సెక్షన్ 8 అమలు తదితర అంశాలు చర్చకు వస్తున్న సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అవుతారు. ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీపై చర్చించే అవకాశం ఉంది. హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక ప్యాకేజీలపై కేంద్రం సమాలోచనలు చేస్తున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఇదివరకే గవర్నర్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా గవర్నర్ సదరు కమిటీపై సమగ్రంగా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. 
 
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని భేటీకి సయ్.. అంటూనే మరోవైపు అవసరాలపై ఆరా తీయడానికి గవర్నర్‌ను ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంటే ఆంధ్రాకు ఎంత నిధులిస్తే బాగుంటుంది లేదా హోదా అవసరం ఉందా లేదా అనే అంశాలను గవర్నర్‌తో చర్చిస్తారన్నమాట.. అంటే బాబు గవర్నర్‌ను కూడా ప్రసన్నం చేసుకోవాలన్నమాట.