గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (13:11 IST)

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం చేయాలి... లేకుంటే లైసెన్సులు రద్దు!

రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలా చేయని ఆస్పత్రుల లైసెన్సులు చేస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నిరోధించేందుకు ఆగస్టు ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
అలాగే, రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యం అందించడానికి నిరాకరించే ఆస్పత్రులు, వైద్యులపై క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. రోడ్డుప్రమాదాల్లో గాయపడ్డవారికి సమీప ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చి ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు అందించాలని, ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. 
 
కాగా, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు వైద్యం అందించేందుకు ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోందని రవాణా, రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి. శామ్‌బాబు సమావేశంలో ప్రస్తావించారు. అయితే, ట్రామాకేర్‌లు లేని చోట మెడికల్‌ కాలేజీలను వినియోగించుందుకు తగిన విధానం రూపొందించాలని సీఎస్‌ ఆదేశించారు.