బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 26 ఏప్రియల్ 2017 (19:07 IST)

అందరితో చర్చించాకే అమరావతి రాజధాని నిర్మాణాలు... మంత్రి నారాయణ

అమరావతి : రాబోయే మూడు నెలల్లో మున్సిపాల్టీల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన 5 హడ్కో అవార్డులు ప్రభుత్వ పనితీరు తెలియజేస్తున్నాయన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహి

అమరావతి : రాబోయే మూడు నెలల్లో మున్సిపాల్టీల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన 5 హడ్కో అవార్డులు ప్రభుత్వ పనితీరు తెలియజేస్తున్నాయన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో 33 ఎకరాలు సేకరించినందుకు గానూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సిఆర్డీఏ) కు అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి లభించిందన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏకు మరో అవార్డు దక్కిందన్నారు. ఎటువంటి వంపుల్లేకుండా చేపడుతున్న రోడ్ల నిర్మాణాలకు గానూ ఈ అవార్డు లభించిందన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి  మరో అవార్డు వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో చేపడుతున్నరెండు అభివృద్ధి పనులకు మరో రెండు అవార్డులు లభించాయన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ పక్కనున్న కొండపై ఏర్పాటు చేసిన ట్యాంకు నుంచి నీటి సప్లయ్ చేస్తున్నందుకు గానూ ఒక అవార్డు దక్కిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టనివిధంగా ఎకానమికలీ వీకర్ సెక్షన్ ఇళ్ల నిర్మాణాల్లో అసుసరిస్తున్న విధానానికి గానూ మరో అవార్డు లభించిందన్నారు.
 
రాష్ట్రంలో 1,20,000 ఇళ్లకు గానూ 1,10,000 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచామన్నారు. సాధారణ ఇళ్ల మాదిరిగా కాకుండా స్లాబుతో పాటు ఒకేసారి నాలుగు గోడలనూ కాంక్రీట్ తో నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఇలా వినూత్న రీతిలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు గానూ ఏపీ ట్రిట్ కోకు హడ్కో అవార్డు లభించిందన్నారు. ఎల్ఈడీ బల్బుల వినియోగంలోనూ మనమే దేశంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. లక్షా 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించి, మిగిలిన రాష్ట్రాలకంటే మనమే ముందున్నామని మంత్రి నారాయణ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలోనే ఆన్‌లైన్లో బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతిలిస్తున్నామన్నారు. 
 
మిగిలిన రాష్ట్రాల్లోనూ ఏపీ బాటలోనే ఆన్లైన్‌లో బిల్డింగ్‌కు అనుమతులివ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. ఇలా రాష్ట్రాభివృద్ధిలో వినూత్న రీతిలో మౌలిక వసతుల కల్పించడంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాల్టీల్లోనూ రోడ్ల మధ్య డివైడర్ల నిర్మించి, వాటిపై పూల మొక్కలు పెంపకం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. వచ్చే ఆగస్టులోగా సీఎం ఆదేశాలనుసారం మున్సిపాల్టీల్లో రోడ్ల మధ్య డివైడర్ల నిర్మించి పూల మొక్కల ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇందుకయ్యే వ్యయాన్ని మున్సిపాల్టీ, ప్రభుత్వం భరిస్తాయన్నారు. 
 
దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చేపట్టని విధంగా ఏపీలో ఉన్న మున్సిపల్ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సులను అమలు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు పొందుతున్నామన్నారు. అలాగే, మున్సిపల్ పరిధిలో ఉన్న ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వెయిటింగ్ హాళ్లలో ఏసీ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తున్నామన్నారు. రాబోయే మూడు నెలల్లో మున్సిపాల్టీల్లో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
 
లండన్ పర్యటన ఏప్రిల్ 2 కి వాయిదా
సీఆర్డీఏ అధికారులతో కలిసి తాను వెళ్లాల్సిన లండన్ పర్యటనను వచ్చే నెల 2 తేదీకి వాయిదా వేశామని విలేకరులు వేసిన ప్రశ్నకు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సమాధానమిచ్చారు. ఈ పర్యటన 2, 3, 4 తేదీల్లో మూడ్రోజుల పాటు సాగుతుందన్నారు. 
 
అందరితోనూ చర్చించిన తరవాతే రాజధాని నిర్మాణాలపై తుది నిర్ణయం..
రాజధానిలో చేపట్టబోయే నిర్మాణాలపై అందరితో చర్చించిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడిన మరో రెండు కమిటీలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేపిటల్ కమిటీ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కమిటీ, మంత్రుల కమిటీ, ప్రిన్సిపల్ సెక్రటరీల కమిటీ కలిసి రాజధానిలో చేపట్టబోయే నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టే నిర్మాణాలు ఒకేసారి చేపడతామని, అందుకు వీటిపై అందరితోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు.