శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (07:41 IST)

కన్నతల్లి మందలించినా డ్రైవర్‌ని వదిలేసి కారు తీసుకెళ్లిన నిషిత్.. 200 కి.మీ. స్పీడ్‌‌తో మెట్రోపిల్లర్‌కు ఢీ

జూబ్లీ హిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం అంటూ వార్తల్లో మనిషైపోయాడు నిషిత్. ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు. ఇంట్లో ముగ్గురు డ్రైవర్లున్నా ఒక్కరినీ తీసుకుపోకుండా మంగళవారం రాత్రి మిత్రుడితో

జూబ్లీ హిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం అంటూ వార్తల్లో మనిషైపోయాడు నిషిత్. ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు. ఇంట్లో ముగ్గురు డ్రైవర్లున్నా ఒక్కరినీ తీసుకుపోకుండా మంగళవారం రాత్రి మిత్రుడితో కలిసి బెంజ్ కారు బయటకు తీసిన నిషిత్.. ఆ విషయం తెలుసుకుని కన్నతల్లి ఫోన్ చేసి మందలించినా వెనక్కు రాలేదు. ఫలితం.. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బెంజ్‌ కారు ఒక్కసారిగా అదుపుతప్పి మెట్రో రైలు పిల్లర్‌ను బలంగా ఢీకొంది. ఆ ధాటికి ఐదారు అడుగులు ఎగిరిపడిన కారు.. తుక్కుతుక్కుగా మారింది. 
 
ఇటీవలే నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా నిశిత్ నియమితులయ్యారు. గత శనివారం సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిశిత్‌.. మరో మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలోనే నారాయణ విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించడం, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడం, రిక్రూట్‌మెంట్ల అంశంపై దృష్టిపెట్టారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో మూడు రోజులుగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిశిత్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా ఉంటున్నారు.
 
మంగళవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిశిత్‌.. హైదరాబాద్‌లోని పలు నారాయణ విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో డ్రైవర్‌ రమేశ్‌ కారును నడిపారు. సాయంత్రం ఇంట్లో విశ్రాంతి తీసుకున్న నిశిత్‌.. రాత్రి 9.30 గంటల సమయంలో రవిచంద్రతో కలసి బయటకు వెళ్లినట్లు సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. నారాయణ ఇంటి వద్ద ముగ్గురు డ్రైవర్లు ఉంటారు. మంగళవారం రాత్రి నిశిత్‌ బయటకు వెళుతున్న సమయంలో ఆ ముగ్గురు డ్రైవర్లు ఉన్నా కూడా.. తానే కారు నడుపుకొంటూ వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన నిశిత్‌ తల్లి రమ డ్రైవర్లను మందలించారు. ఒకటి రెండు సార్లు కుమారుడితో మాట్లాడి.. నిద్రపోయారు.
 
రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అనంతరం పలు బ్రాంచీలకు వెళ్లిన నిశిత్‌.. చివరిగా నారాయణగూడ బ్రాంచి నుంచి తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో బయలుదేరారు. నిశిత్‌ కారు నడుపుతుండగా రవిచంద్ర పక్కన కూర్చున్నారు. 2.40 గంటల సమయంలో వారి కారు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దాటి ముందుకు దూసుకుపోయింది. ఆ సమయంలో వాహనం గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఉంది. 
 
9వ నంబర్‌ మెట్రో రైలు పిల్లర్‌ వద్ద రోడ్డు మలుపు ఉండటం, మెట్రో పనులకు సంబంధించి కంకర, ఇసుక పడి ఉండటంతో అతివేగంగా వస్తున్న వాహనం అదుపు తప్పింది. నేరుగా మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొంది. ఈ ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా.. కారు వెనుక భాగం దాదాపు ఐదారు అడుగులు పైకి లేచి కింద పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోకపోవడంతో నిశిత్, రవిచంద్ర అక్కడికక్కడే మరణించారు.