బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (14:41 IST)

పవన్+ భాజపా... బలపడ్డాకే ఏపీకి స్పెషల్ స్టేటస్.. బాబు సంగతేంటి?

పవన్ కల్యాణ్.. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర రాజకీయాల తల రాతను మార్చాడు. విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ప్రశాంతంగా పాలన చేసుకునేలా చేశాడు. జనసేన అంటూ ప్రజల ముందుకొచ్చి.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగకపోయినా బీజేపీకి, బాబుకు మద్దతు ప్రకటించి.. రాష్ట్ర ప్రజల మదిలో నిలిచిపోయాడు.

ఏపీకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన వద్దన్నా.. కాంగ్రెస్ ఎంత మాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చీల్చేసిన నేపథ్యంలో... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక సాయం, ఐఐటీ వంటి నామ మాత్రపు ప్రకటనలపై ప్రజలు ఫైర్ అవుతున్నారు.
 
రైల్వే బడ్జెట్‌లోనే ఏపీకి మొండిచెయ్యి చూపించిన ఎన్డీయే సర్కారు.. తెలంగాణకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించి.. ఏపీకి ప్రత్యేక హోదాపై నోరెత్తకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడంపై ప్రజలు మండిపోతున్నారు. రైల్వే బడ్జెట్‌లో కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ మాత్రమే ప్రకటించిన కేంద్రం.. ఆర్థిక బడ్జెట్‌లోనూ ఆశించిన స్థాయిలో వరాలు కురిపించలేకపోయింది. 
 
బెంగాల్‌తో పాటు ఏపీకి కూడా ఆర్థిక సాయం చేస్తామని నామమాత్రంగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్‌పై నోరెత్తలేదు. దీనిపై టీడీపీ ఎంపీలు సైతం గుర్రుగా ఉన్నారు. ప్రజలు సైతం టీడీపీ, బీజేపీలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టిందని.. అందుకే తెలంగాణకు వరాల వర్షం కురిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
కేసీఆర్, కవిత ప్రధాని నరేంద్ర మోడీ భజన చేయడం వెనుక ఎన్నో ప్రయోజనాలున్నాయని, తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసే దిశగానే ప్యాకేజీలు ప్రకటించడం జరుగుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇంకా టీఆర్ఎస్‌తో దోస్తీ దిశగా ఎన్డీయే సర్కారు మంతనాలు జరుపుతోందని టాక్ వస్తోంది.
 
అలాగే ఏపీలో చంద్రబాబు పక్కన బెట్టేసి.. పవన్ కల్యాణ్‌ జనసేన దన్నుతో తెదేపాను వెనక్కి నెట్టి ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తే.. బీజేపీకే ఆ క్రెడిట్ దక్కుతుందని అందుకే.. ఆర్థిక బడ్జెట్‌లో జైట్లీ స్పెషల్ స్టేటస్ మాటెత్తలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ స్పెషల్ స్టేటస్ పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.