బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (15:30 IST)

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తయారీలో కుట్ర : ఏపీఎన్జీవోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తయారు చేసిన నివేదికలో పొరుగు రాష్ట్రం (తెలంగాణ) నేతల కుట్ర దాగివుందని ఏపీఎన్జీవోలు ఆరోపించారు. ఇదే అంశంపై ఎపీఎన్జీవో నేత విద్యాసాగర్ మాట్లాడుతూ రోడ్డు, రైలు సౌకర్యాలతో పాటు విమానయాన, షిప్పింగ్ సౌకర్యాలకు సమీపంగా ఉన్న ప్రాంతమైన విజయవాడ కాకుండా, ఇవేవీ లేని ప్రాంతాన్ని (వినుకొండ - దొనకొండ - మార్టూరు) శివరామకృష్ణన్ కమిటీ రాజధానిగా సూచించడం వెనుక కుట్ర దాగివుందన్నారు. 
 
విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఆర్థిక, పర్యావరణ సమస్యలు వస్తాయని కమిటీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించలేదని ఆరోపించారు. విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాల్లో 24 వేల ఎకరాలు సాగుబడిలో లేని భూమి ఉందని విద్యాసాగర్ వివరించారు. కనెక్టివిటీలో విజయవాడను మించిన నగరం ప్రస్తుతం దక్షిణాదిన వేరే ఏదీ లేదని గుర్తు చేశారు. 
 
నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల నాయకులు శివరామకృష్ణన్ కమిటీ ద్వారా కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను శివరామకృష్ణన్ కమిటీ ఒక్కో జిల్లాలో పెట్టాలని సూచించడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు... ఇలా మూడూ ఒక చోట ఉంటేనే... పనులు కదలడం లేదని... ఇక, ఈ మూడు విభిన్న నగరాల్లో ఉంటే అసలు ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు.