శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (16:55 IST)

ఉద్ధవ్‌కు అసదుద్దీన్ సమాధానం.. నేను భారతీయుడిని!

తమపైనా.. తమ పార్టీపైనా ఘాటైన విమర్శలు చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. 'నేను భారతీయుడిని. భారత రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదు' అని స్పష్టం చేశారు. 
 
ఉద్ధవ్ ఠాక్రే ముందుగా బీజేపీతో వ్యవహారం చక్కదిద్దుకొని, ఆ తర్వాత తమ గురించి మాట్లాడితే బాగుంటుందని అసదుద్దీన్ సలహా ఇచ్చారు. మజ్లిస్ పార్టీని నిషేధించాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రణీతి షిండేకు నోటీసులు పంపినట్లు ఆయన చెప్పారు. 
 
అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఓవైఎసీ సోదరులు ఛాందసవాద ఆలోచనలను విస్తరింపజేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల ఆలోచనలను మజ్లిస్ పాడు చేస్తోందని ధ్వజమెత్తారు. ఓవైసీ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న మజ్లిస్ హిందువులకు అత్యంత ప్రమాదకరమైన శక్తులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలలు పైకెత్తాయని ఆయన వ్యాఖ్యానించారు.