శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:47 IST)

మోడీని 70 శాతం మంది వ్యతిరేకించారు.. దిగ్విజయ్‌కు నోటీసు : అసదుద్దీన్

గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 30 శాతం మాత్రమే. అంటే బీజేపీని 70 శాతం మంది వ్యతిరేకించినట్టేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అంతేకాకుండా, బీజేపీకి నరేంద్ర మోడీకి మధ్య ఎంఐఎం మధ్యవర్తిగా ఉందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు త్వరలోనే నోటీసు జారీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఇకపై జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ధీటుగా ఎంఐఎం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. దేశమంతటా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్‌ను చూసి కాంగ్రెస్‌ భయపడుతోందని, అందుకే తమకు, బీజేపీకి సంబంధాలు ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. 
 
ఇకపోతే బీజేపీ గెలుపుతో 1200 ఏళ్లుగా బానిసత్వంలో మగ్గిన భారతదేశానికి విముక్తి లభించిందని నరేంద్ర మోడీ అంటున్నారు. వాస్తవంలో, గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 30 శాతం మాత్రమే. అంటే, 70 శాతం ప్రజలు బీజేపీని వ్యతిరేకించినట్టే కదా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. బీజేపీకి, మోదీకి మస్లిస్‌ ఏజెంట్‌గా మారిందన్న దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.