బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (08:05 IST)

ఏటిఎం బ్యాటరీలను తినేశారు... ఊచలు లెక్కడుతున్నారు.

దొంగలందరిదీ ఒక దారైతే విజయవాడ దొంగలది మరో దారి. ఏటిఎంలను పగులగొట్టి నగదు పట్టుకెళ్ళే ఘరానా దొంగలు కొందరైతే వాటి బ్యాటరీలను మాయం చేసే జల్సారాయుళ్ళ బ్యాచ్ మరోటి. రాజధాని నగరంలో ఏటిఎంలను డిచార్జ్ చేస్తూ బ్యాంకులకు సవాల్ విసురుతున్న కేటుగాళ్ళను విజయవాడ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టేశారు. 
 
కాళ్ల సుబ్రహ్మణ్యం, షేక్ అహ్మద్ ఆలీ, షేక్ మహ్మద్ వలీ వీరిదో చిల్లర బ్యాచ్. ఏటిఎంలను చూస్తే వీరికి ఆకలేస్తుంది. వాటి బ్యాటరీలను మాయం చేసేస్తారు. మొదటి నిందితుడైన సుబ్రహ్మణ్యం వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. కొంతకాలం పాటు ఏటీఎంలకు ఎలక్ట్రీషియన్‌గా పని చేశాడు.  ఇతనికి ఇద్దరు స్నేహితులు షేక్ అహ్మద్ ఆలీ, షేక్ అహ్మద్ వలీ. పని పాట లేకుండా తిరుగుతుండే బ్యాచ్. వ్యసనాలకు లోనైన సుబ్రమణ్యం, దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తనతో ఆ బ్యాచ్ కలుపుకున్నాడు. నగరంలోని ఏటింఎంలకు స్పాట్ పెట్టారు. 
 
ఆ తర్వాత వారితో కలిసి బ్యాటరీల చోరీ ప్రారంభించాడు. మూడు నెలల వ్యవధిలో నగరంలోని మాచవరం, సత్యనారాయణపురం, పటమట, పెనమలూరు, సూర్యారావుపేట, అజిత్‌సింగ్‌నగర్, కృష్ణలంక పోలీసు స్టేషన్ల పరిధిలో పలు ఏటీఎంలలో బ్యాటరీలు దొంగిలించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంప్రాంతాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 66 బ్యాటరీలు చోరీ చేశారు.
 
రాత్రిళ్ళు నిశాచర జీవుల్లా సంచరిస్తున్న వీరిపై పోలీసులకు అనుమానం కలిగి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నాలుగు పీకితే.. విషయం మొత్తం కక్కేశారు. అంతే వారి వద్ద నుంచి రూ. 2.5 లక్షల నగదు, 66 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి నెట్టేశారు.