గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 28 మే 2015 (10:28 IST)

తెలంగాణలో టీఆర్‌ఎస్ ఆకర్ష్... ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తులు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సాహసం చేసి తమ బలం కంటే ఓ అభ్యర్థిని అధికంగానే రంగంలోకి దింపింది. ఇదే అన్ని పార్టీలను వణికిస్తోంది. తాను వణుకుతూనే ఇతర పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది టీఆర్ ఎస్. ఆకర్ష్ పేరుతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఆరు స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతుండగా ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఐదుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కాగా, కాంగ్రెస్‌, టీడీపీ-బీజేపీల నుంచి ఒక్కో అభ్యర్థి ఉన్నారు. అయితే ఎంఐఎం మద్దతుతో నాలుగు స్థానాలను సులువుగా గెలుస్తామని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం. తమతోపాటు ఎవరికీ పూర్తి స్థాయి మెజార్టీ లేదనే ఉద్దేశంతో పార్టీ తరఫున ఐదో అభ్యర్థినీ రంగంలోకి దించింది. 
 
ఈ ఎన్నికల్లో తమ అంచనాలన్నీ తలకిందులై పార్టీ అభ్యర్థి ఒకరు ఓడిపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే, ముందు జాగ్రత్తగా కొంత మంది ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టటంపై దృష్టి సారించారని సమాచారం. టీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
అయితే ఆయన వరంగల్‌ జిల్లా నర్సంపేట నుంచి ఎమ్మెల్యే కావటం, అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నాయకుడు కావటంతో దొంతి మద్దతు పొందటంపై ఆ జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలే కాకుండా, సీనియర్‌ మంత్రి ఒకరు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. దీంతో పార్టీ అధిష్ఠానం మరొక మంత్రిని రంగంలోకి దించటంతో ఆయన తరఫున ఇటీవల పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఒకరు దొంతి మాధవరెడ్డితో వరంగల్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో మంతనాలు సాగించినట్లు తెలిసింది. ఆయనతో ఫోన్‌లో అధిష్ఠానం ముఖ్యులు కూడా మాట్లాడి, ఈ నెల 29న జరిగే టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి రావాలని కోరినట్లు సమాచారం.
 
మరోవైపు, మద్దతు కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఒక టీడీపీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఒకరిపైనా అధికార టీఆర్‌ఎస్‌ గురిపెట్టినట్లు తెలుస్తోంది. వారితో సీనియర్‌ మంత్రి ఒకరు ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. ఇక, ఈ ఎన్నికలపై పూర్తి అవగాహన కల్పించటంలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేల కోసం మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది.