శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (20:41 IST)

ఎన్టీఆర్‌కు ప్రాంతీయత అంటగడతారా : మంత్రి అశోకగజపతి రాజు!

స్వర్గీయ ఎన్.టి రామారావుకు ప్రాంతీయత అంటగట్టడం విచారకరమని కేంద్ర పౌరవిమానయాన మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా.. శంషాబాద్‌ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే నిర్ణయం ఈనాటిది కాదని ఆయన వివరించారు. 
 
శంషాబాద్‌ విమానాశ్రయం పేరు మార్పుపై జరుగుతున్న రాద్దాంతంపై ఆయన శుక్రవారం ఢిల్లీలో స్పందిస్తూ... 1999లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టినట్టు తెలిపారు. విమానాశ్రయం నిర్మించిన తర్వాత 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్ణయం సగమే అమలు చేసిందన్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానం చేయడంపై కూడా అశోక్‌గజపతి రాజు స్పందించారు. సమాఖ్య విధానంలో ఎవరు ఎక్కడైనా తీర్మానం చేయవచ్చునన్నారు. గత వైఎస్‌ సర్కార్‌ ఎన్టీఆర్‌ పేరును విస్మరించిందని... ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, మేం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని మంత్రి వివరణ ఇచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి రాజీవ్‌ గాంధీ పేరు మాత్రమే పెట్టాలని కేంద్ర కేబినెట్‌ ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని, రాజీవ్‌ గాంధీ, ఎన్టీఆర్‌, కేసీఆర్‌, కొమరం భీం అందరూ భారతీయులేనని అశోక్‌గజపతిరాజు చెప్పుకొచ్చారు.