మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (08:18 IST)

బాబూ... విజయవాడలో నీ విడిదెక్కడ..? భద్రతపై భయపడుతున్న అధికారులు

రాష్ట్ర పర్యటన కోసం వచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడుండాలి.? జిల్లాల పర్యటనకోసం వచ్చినప్పుడు దాదాపుగా ఎక్కడా ఉండడం లేదు. విజయవాడకు వెళ్లితే అక్కడ రివ్యూలతో రాజధాని పనులను వేగవంతం చేవచ్చుననేది ఆయ‌న ఆలోచ‌న. అందుకే అక్కడకు చేరుకుంటున్నారు. మ‌రి అక్క‌డ ఉండ‌డానికి స్థాన‌మేది? ఎక్క‌డ బ‌స చేయాలి.? విధిలేని స్థితిలో బస్సులోనే పడక వేశారు. క‌నీసం ఐదారు ఇళ్లు చూసిన అధికారులు వ‌స‌తి గృహాన్ని నిర్ణ‌యించ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. తాజాగా లింగ‌మ‌నేని అతిథి గృహాన్ని ప‌రిశీలిస్తున్నా.. భ‌ద్ర‌త విష‌యంలో వెనుక‌డుగు వేస్తున్న‌ట్లు స‌మాచారం. 
 
సిఎం విడిది చేయనున్న అతిధిగృహం తాడేపల్లి మండలం ఉండవల్లి సమీపం లోని కరకట్టకు ఆనుకొని ఉంది. ఈ అతిధి గృహానికి అన్ని హంగులు సమకూర్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. అయితే భ‌ద్ర‌త విష‌యంలోనే కాస్త వెనుక‌డుగు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెక్యూరిటి డీఐజీ రామకృష్ణ, గుంటూరు అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి తదితర పోలీసు అధికారులు అతిధి గృహాన్ని పరిశీలించారు.
 
అనంతరం ప్రత్యేక బోటులో కృష్ణానదిలో పర్యటించారు. భద్రతాధికారులు అతిధి గృహాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి భద్రతకు అనువుగా ఉండదని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. న‌దిలో అల్లంత దూరం నుంచి టార్గెట్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.  అత్య‌వ‌స‌ర‌మ‌నిపిస్తే, కరకట్ట మార్గం ఇరుకుగా ఉండడం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అలాగే కృష్ణానదికి అంచున ఉండడంతో వరద ఉధృతి సమయంలో అతిధి గృహంలోకి నీరు వచ్చే ప్రమాదం ఉన్నట్టు భావిస్తున్నారు. సిఎం విడిది చేసే అతిధి గృహం కృష్ణానది తీరాన ఉండడంతో నదిలో కూడా భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంది. 
 
మ‌రోవైపు ఈ నిర్మాణంపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలుగా గుర్తించిన వాటిలో లింగమనేని అతిధి గృహం కూడా ఉంది. దీనికి ఇరిగేషన్‌ మరియు రివర్‌బెల్ట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. వివాదాస్పద అతిధి గృహంలో సిఎం విడిదిచేస్తారా..! చేస్తే ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో..! అనేది కూడా అనుమానంగా ఉంది.
 
అయితే అతిధి గృహానికి సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌, విద్యుత్‌శాఖ తదితర అధికారులతో అతిధిగృహ పరిసరాలను పరిశీలించి వసతి కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌక‌ర్యంపై స‌మీక్ష జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా భ‌ద్ర‌తాప‌ర‌మైన ప‌రిశీల‌న జ‌రిపిన అధికారులు ఏ నివేదిక ఇస్తారో వేచి చూడాల్సిందే..