శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 1 జూన్ 2017 (05:13 IST)

దాసరి నిజంగా అంత మాటన్నారా.. ఇప్పుడు దానికి రుజువెలా?

తెలుగు చలనచిత్ర దిగ్గజం దాసరి నారాయణ రావు కన్నుమూసి రెండు రోజులైనా కాలేదు అప్పుడే ఆయన పేరుమీద రాజకీయాలు జరుగుతున్నాయి. యావత్ తెలుగు ప్రజానీకం, దక్షిణాది, ఉత్తరాది సినిమా జనం దాసరికి నివాళులర్పిస్తున్న నేపధ్యంలో ఆయన తమ పార్టీకి పూర్తి మద్ధతు పలికారంటూ

తెలుగు చలనచిత్ర దిగ్గజం దాసరి నారాయణ రావు కన్నుమూసి రెండు రోజులైనా కాలేదు అప్పుడే ఆయన పేరుమీద రాజకీయాలు జరుగుతున్నాయి. యావత్ తెలుగు ప్రజానీకం, దక్షిణాది, ఉత్తరాది సినిమా జనం దాసరికి నివాళులర్పిస్తున్న నేపధ్యంలో ఆయన తమ పార్టీకి పూర్తి మద్ధతు పలికారంటూ వైకాపా రంగంలోకి దిగిపోయింది. ఇందులో నిజానిజాలు ఏమిటో ఇప్పుడు బయటపడటం కష్టమే. ఎందుకంటే ఆ మాటలన్నారంటున్న పెద్దాయనే ఇప్పుడీ లోకం లోనే లేరు.

కానీ దాసరి అలా అన్నారన్న వ్యక్తి అల్లాటప్పా మనిషి కాదు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు భూమన కరుణాకర రెడ్డి స్వయంగా ఈ మాట చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని కూడా దాసరి తమకు మాట ఇచ్చారని భూమన పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఇంతకూ భూమన ఏమన్నారంటే... 
 
వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనతో కలసి దాసరి నారాయణరావును రెండుసార్లు కలుసుకున్నట్టు భూమన తెలిపారు. మనస్ఫూర్తిగా జగన్‌ను ఆశీర్వదిస్తూ... నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని దాసరి చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 2017 చివరినాటికి వైఎస్సార్‌సీపీలో బేషరతుగా చేరతానని, 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తిరిగి జగన్‌ గెలుపుకోసం ప్రచారం చేస్తానని దాసరి తమతో అన్నారని భూమన తెలిపారు. 
 
ఈ నెల 4న దాసరి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పినపుడు కూడా ఆయన ఆత్మీయంగా మాట్లాడి ఆశీర్వదించారన్నారు. ఇంతలోనే దాసరి మృత్యుఒడికి చేరుకోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆయన మృతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌కూ తీరని లోటని భూమన పేర్కొన్నారు. 
 
బుధవారం హైదరాబాద్‌లోని దాసరి స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన నేపథ్యంలో భూమన మీడియాతో మాట్లాడిన మాటలు పలు సందేహాలను కలిగస్తున్నాయి. స్వయంగా దాసరి చెబితే తప్ప ఇప్పుడు నిర్ధారించుకోలేని విషయాన్ని భూమన బాబులాగా పేల్చారు. 
 
అయితే దాసరి మొదటిసారిగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడానికి ముందు రోజు సాక్షి టీవీకి ఇచ్చిన మనసులో మాట ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ అత్యద్భుతంగా పనిచేస్తున్నారని, సమస్యల పట్ల ఎవరూ స్పందించనంత వేగంగా స్పందిస్తున్నారని దాసరి స్పష్టంగా చెప్పారు. అలాగే కాపు రిజర్వేషన్ సమస్యపై దాసరి వైకాపాతో ఒక అవగాహనకు వచ్చారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి.
 
కాబట్టి భూమన వైకాపాకు దాసరి మద్దతు తెలిపారని చేసిన ప్రకటన నిజమే అయినప్పటికీ అది ఇప్పుడు నిర్ధారణకు నోచుకోని అంశంలా తయారైంది.