శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (16:21 IST)

వైకాపా డోసు పెంచిన బీజేపీ.. మారితే ఓకే.. లేదంటేనా... కన్నా వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడికి దిగుతోంది బీజేపీ. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌పై ఆరోపణలు చేస్తున్న బీజేపీ తాజాగా మరోసారి విరుచుకుపడింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలుగుదేశం ప్రభుత్వానికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆరోపించారు. వైయస్ జగన్ చెప్పేవి ఏమీ కింది స్థాయిలో ఏమీ జరగడం లేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మతమార్పిడులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. 
 
ప్రభుత్వాలు కుల, మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పుకొచ్చారు. పద్దతి మార్చుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో రోడ్డెక్కాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం పెద్ద గగనంగా మారిపోయిందన్నారు. 
 
ఒకప్పుడు రూ.10 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.20 వేలకు కూడా దొరకడం లేదని ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాలపై సీఎం జగన్ కు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. ఒక ఆరునెలలపాటు అధికార పార్టీకి అవకాశం ఇస్తామని ఆ తర్వాత రోడ్డెక్కుతామని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.