బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2016 (14:48 IST)

క్రైస్తవులు ఎంతో గొప్ప వ్యక్తులు.. హిందువులు అలా కాదు.. మంత్రి బొజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు

ఆయనో ప్రజాప్రతినిధి. రాష్ట్ర మంత్రి కూడా. ప్రజా సమస్యలపై ఎప్పుడు పట్టించుకోవాలో బాగా తెలిసిన రాజకీయ నేత. కుల, మతాలను పూర్తిగా పక్కనే పెట్టి అందరిని కలుపుకుని పోవాలి. అలాంటి వ్యక్తి ఒక మత కార్యక్రమానికి హాజరై మరో మతాన్ని కించపరుస్తూ మాట్లాడారు. అది ఎక్కడో కాదు... పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోనే. 
 
తిరుపతిలో క్రిస్టియన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కావడంతో ఆ ట్రస్టు నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణా రెడ్డి  హిందువులను కించపరిచేలా మాట్లాడారు. క్రిస్టియన్లు ఎంతో గొప్ప వ్యక్తులని, పేద ప్రజలకు సేవ చేయడానికి వెనుకాడరని, అదే హిందువులైతే అలా కాదని దెప్పి పొడిచే మాటలు మాట్లాడారు. 
 
అంతేకాదు హిందువుల గురించి అందరికీ తెలుసునని కూడా చెప్పారు. దీన్ని బట్టి మంత్రిగారు క్రైస్తవ మతస్థులను ఏ విధంగా పొగడ్తలతో ముంచెత్తారు అర్థమైపోతుంది. దీంతో అక్కడున్న వారందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక హిందువు అందులోను ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడడం ఏమిటని ముక్కునవేలేసుకున్నారు. 
 
తిరుపతి వంటి ఆధ్మాత్మిక క్షేత్రంలో మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మరో మతం గురించి మాట్లాడడంపై కొంతమంది హిందూ ధార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మొత్తంమీద బొజ్జల చేసిన వ్యాఖ్యలు చిత్తూరుజిల్లాలో హాట్‌ టాపిక్‌‌గా మారింది.