శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (15:39 IST)

నెట్టవద్దన్నందుకే భూమాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా : బొత్స

నెట్టవద్దన్నందుకు తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెడతారా అని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న చిన్నపాటి గొడవను కారణంగా చూపి స్థానిక డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బొత్స సత్యనారాయణ శనివారం విలేకరులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కర్నూలులో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. భూమాను పోలీసు అధికారి ఉద్దేశపూర్వకంగానే నెట్టారన్నారు. దీంతో తనను నెట్టవద్దన్నందుకే భూమాపై అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. 
 
టీడీపీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదన్న వంకతో భూమాను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించలేదని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా భూమా కుమార్తె అఖిల ప్రియ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. 
 
అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని రాష్ట్రపతి అన్నారంటే ఓటుకు నోటు కేసు సమసిపోయినట్టుకాదని వైకాపా తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్ర సంబంధాలు వేరు, ఓటుకు నోటు కేసు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8ని ముడిపెట్టేలా మాట్లాడొద్దని హితవు పలికారు.